దారుణం… పిల్లిని సజీవ దహనం చేసిన కిరాతకుడు

  • Publish Date - July 22, 2020 / 07:30 AM IST

మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. సాటి మనుషులతో దురుసుగా, కర్కశంగా ప్రవర్తించే మనుషుల్ని మనం చూస్తూనే ఉన్నాం. మనుషులపట్లే కాదు మూగ జీవాల పట్ల కూడా కర్కశంగా ప్రవర్తిస్తూ తమ లోని రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు కొందరు.

హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి బతికున్న పిల్లిపై లైటర్ వెలిగించి పడేశాడు. అది భాధను భరించలేక అటు ఇటూ పరిగెత్తుతూ ఒక చోట కుప్పకూలిపోయి మరణించింది. పైగా తాను చేసింది గొప్ప పనైనట్ల ఈ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కర్కోటకుడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ తీవ్రంగా స్పందించింది. ఈ అమానుష ఘటన చేసిన వ్యక్తి ఆచూకి చెపితే రూ.50 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.

గడ్డిలో పడుకున్న పిల్లిపై మండే స్వభావం గల ద్రావకం పోసి దానిపై లైటర్ తో అంటించటంతో క్షణాల్లో పిల్లి మంటల్లో చిక్కుకుంది. ఒంటిపై చెలరేగిన మంటలతో ఆ పిల్లి ప్రాణభయంతో అటు ఇటు పరుగుతీసి ఒకచోట మూలుగుతూ పడిపోయి కన్నుమూసింది.

ఈ ఘటనపై హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ పర్నా సేన్ గుప్తా మాట్లాడుతూ… బతికున్న ఒక మూగజీవికి నిప్పు పెట్టి కాల్చేశారంటే వారిలో ఎంత క్రూరత్వం ఉందో అర్ధం చేసుకోవచ్చు.మానవత్వం లేని ఇలాంటి వారి పట్ల ఇంకెందరు బలి అవ్వాల్సి వస్తుందో. ఇలాంటి ఘటనలపై తక్షణం చర్యలు తీసుకోవాలి అని అన్నారు.