ఉత్తర ప్రదేశ్ లో నగల వ్యాపారి సజీవ దహనం

  • Publish Date - August 19, 2020 / 04:13 PM IST

ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్,  సీఎం యోగి ఆదిత్యనాధ్  ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన్ని ఆయన ఖండించారు. ఈ సంఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి అదుపు తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు.



ఫిరోజాబాద్ లో నగల వ్యాపారం చేసే రాకేష్ వర్మను అతని సమీప బంధువు రాబిన్ సన్ ఆగస్ట్ 18, మంగళవారం సజీవ దహనం చేశాడు. వ్యక్తిగత కారణాలతోనే అతని కజిన్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ద్వారకాదీష్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గోల్డ్ మార్కెట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. నిందితుడు రాబిన్ సన్, పెయింట్స్ లో కలిపే తిన్నర్ అనే మండే స్వభావం కల ద్రావకాన్ని రాకేష్ వర్మపై పోసి నిప్పంటించాడు. ఇది గమనించిన స్ధానికులు రాకేష్ ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.



అప్పటికే 90 శాతం కాలిన గాయాలతో ఉన్న రాకేష్ కు అక్కడ ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఆగ్రా తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాబిన్ సన్ కోసం గాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు