విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నేరం రుజువు కావటంతో ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
తీర్పు అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ…. విజయవాడ సమీపంలోని గొల్లపూడి నల్లకుంట వద్ద ఏడేళ్ల చిన్నారి ద్వారకా పై అత్యాచారం చేసి హత్య చేశాడని తెలిపారు. నిందితుడికి, హతురాలి తల్లికి ఉన్న అక్రమ సంబంధం తెలిసిపోవటంతో నిందతుడు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు.
విజయవాడ భవానీపురం పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించటంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ కేసులో 7యేళ్లు, 20యేళ్లు, జీవిత ఖైదు, ఉరి శిక్షను న్యాయమూర్తి విధించారన్నారు. ఉరి శిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉందని.. డిఫెన్స్ కూడా నేరం చేసినట్లు అంగీకరించిందని పీపీ నారాయణరెడ్డి వివరించారు.