కాళ్ల పారాణి ఆరక ముందే పెళ్లైన మూడు రోజులకే కన్న కూతురు కన్ను మూసింది. పచ్చని పందిట్లో పెళ్లినాటి ముచ్చట్లు తీరకముందే విషాదం అలుముకుంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురుకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకోవటం రెండు కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లితండ్రులను ఓదార్చటం ఎవరితరం కావటం లేదు.
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వై.సీతానగరంలో శ్రావణ శుక్రవారం పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. వై. సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమ్య శ్రీదేవి (20) డిగ్రీ చదువుతోంది. రమ్యశ్రీదేవికి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన మేనమామతో మూడు రోజుల క్రితం, బుధవారం తల్లిదండ్రులు వివాహం జరిపించారు.
శనివారం ఆగస్ట్ 1న అత్తవారింటికి పంపాల్సి ఉంది. కాగా ఆమె నిన్న శుక్రవారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన తల్లితండ్రులు వెంటనే ఆమెను మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమై కన్ను మూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇష్టం లేని పెళ్లి కావచ్చని, లేదా చదువు మధ్యలో ఆగిపోతుందనే బాధతోనైనా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
మృతురాలు ఇటీవలే డార్క్ వేలంటైన్ అనే షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. లవ్ ఫెయిల్యూర్ ప్రధానాంశంగా రూపొందించిన ఈ హరర్ షార్ట్ ఫిల్మ్ ఆగస్ట్టు 2వ తేదీన విడుదల కానుంది. కాగా ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుని కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది.