సోషల్ మీడియాలో అయ్యే పరిచయాలు తో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. స్నేహితులు స్నేహం కన్నా వివాహేతర సంబంధాలు పెట్టుకోటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. బంగారంలాంటి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. పచ్చటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఫేస్ బుక్ పరిచయం అయిన ఉత్తర ప్రదేశ్ యువతితో కలిసి జీవించాలనుకుని, నేరం చేసి దొరికిపోయాడు నిజామాబాద్ యువకుడు.
నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ పూర్ కు చెందిన అశ్వాక్(24) అనే యువకుడికి ఫేస్ బుక్ లో , ఉత్తర ప్రదేశ్ లోని మురాలాబాద్ జిల్లాకు చెందిన వివాహిత(28) పరిచయం అయ్యింది. ఫేస్ బుక్ చాటింగ్ ద్వారా మొదలైన పరిచయం ఒకరి నొకరు ఫోన్లలో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. ఇది క్రమేపి ప్రేమగా మారింది.
నిజామాబాద్ యువకుడు ఉత్తర ప్రదేశ్ వెళ్లి తన ఫేస్ బుక్ ప్రేయసిని పలుమార్లు కలిశాడు. తన భర్తను వదిలివచ్చేస్తానని, లేచి పోయి కలిసి జీవిద్దామని ఆమె కోరిన మీదట…అశ్వాక్ ఆమెను తీసుకు వచ్చేందుకు ఆగస్టు5న కారు తీసుకుని ఉత్తర ప్రదేశ్ వెళ్ళాడు. అక్కడకు వెళ్లి బయలుదేరే ముందు…. కలిసి జీవించేందుకు డబ్బులు ఎలా అనే ప్రశ్న తలెత్తింది ఇద్దరికీ.
ప్రియురాలి సూచన మేరకు ఆమె కుమారుడిని కిడ్నాప్ చేశాడు. 40 కిలోమీటర్లువచ్చిన తర్వాత ఆమె భర్తకు ఫోన్ చేసి నీ కుమారుడిని కిడ్నాప్ చేశానని చెప్పి డబ్బుడిమాండ్ చేశాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలిసి బాలుడిని అక్కడే వదిలేసి పరారై నిజామాబాద్ వచ్చేశాడు.
ప్రియురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్ నెంబరు ఆధారంగా గురువారం, ఆగస్టు13న నిజామాబాద్ చేరుకున్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు అశ్వాక్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఉత్తర ప్రదేశ్ వెళ్ళటానికి వినియోగించిన కారును, డ్రైవర్ గా వెళ్లిన సాటాపూర్ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిని జిల్లా కోర్టులో హజరు పరిచి తదుపరి విచారణ నిమిత్తం ఉత్తర ప్రదేశ్ తరలించారు.