కరోనా అన్ లాక్ టైంలో అందరూ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటుంటే… కొందరు అక్రమార్కులు అన్ లాక్ సమయాన్ని వ్యభిచార వృత్తిలో డబ్బులు సంపాదించటానికి వినియోగించుకుంటున్నారు.
వేరే రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్ రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రాచకొండ ఎస్ వోటీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు యువతులను రక్షించారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు.
మహబూబ్ నగర్ కు చెందిన ఎ.శివకుమార్, కరీంనగర్ కు చెందిన చిన్నా ఇద్దరూ స్నేహితులు. వీరికి వెస్ట్ బెంగాల్, ముంబై ఇతర రాష్టాల నుంచి అమ్మాయిలను అక్రమంగారవాణా చేసే ముఠాతో పరిచయాలు ఉన్నాయి. తక్కువ సమయంలో డబ్బుసంపాదించాలనే దుర్భుద్దితో వారిని సంప్రదించారు.
ఇతర రాష్టాల నుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించాలనుకున్నారు. హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఎగ్రిమెంట్ చేసుకుని వెస్ట్ బెంగాల్ నుంచి బ్రోకర్ల ద్వారా యువతులను హైదరాబాద్ కు రప్పించారు.
దిల్ సుఖ్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని హైదరాబాద్ వచ్చిన యువతులను అక్కడ ఉంచేవారు. యువతుల ఫోటోలు ఆన్ లైన్ లో, వాట్సప్ లో పెట్టి విటులను ఆకర్షించేవారు. ఒక్కో కస్టమర్ నుంచి 5వేల నుంచి 8 వేల రూపాయలు దాకా వసూలు చేసేవారు. విటులు చెప్పిన అడ్రస్ కు అమ్మాయిలను పంపించేవారు.
ఈ వ్యభిచార ముఠాపై సమాచారం తెలుసుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు నేరేడ్ మెట్, వాయుపురి కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసారు. నిర్వాహకుడు శివకుమార్ ను అదుపులోకి తీసుకుని ఇద్దరు యువతులను రక్షించారు. వారిని నేరేడ్ మెట్ పోలీసులకు అప్పగించారు. మరో నిర్వాహాకుడు చిన్నా పరారీలో ఉన్నాడు. శివకుమార్ నేరం అంగీకరించటంతో అతడిని రిమాండ్ కు తరలించారు.