భార్యపై అనుమానంతో హత్య చేసి…. ఆత్మహత్య చేసుకున్న భర్త….

  • Publish Date - September 23, 2020 / 06:35 PM IST

Crime News తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కురుండంకోడు పంచాయతీ పరిధిలోని గ్రామంలో దారుణం జరిగింది మద్యానికి బానిసైన భర్త, భార్యపై అనుమానం తో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవటంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.

కురుండంకోడు పంచాయతీ పరిధిలో నివసించే రాజశేఖర్ కొబ్బరి కాయలు కోసే వృత్తి చేసేవాడు. సమీపంలోని గ్రామాల్లోని కొబ్బరి చెట్లు ఎక్కికాయలను కోసి వాటిని వలిచేవాడు. రాజశేఖర్ కు భార్య బంగారం, స్కూలుకు వెళ్లే ఒక కుమారుడు,  కుమార్తె ఉన్నారు. రాజశేఖర్ మద్యానికి అలవాటు పడ్డాడు. రోజు కొబ్బరి కాయలు ఒలచగా వచ్చిన డబ్బుతో తాగి ఇంటికి వచ్చేవాడు. మిగిలిన డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు.



ఆ డబ్బుతో ఇల్లుగడవటం కష్టంగా ఉందని బంగారం రోజు భర్తతో గొడవ పడేది. ఇల్లు గడవటం కష్టంగా మారటంతో భార్య బంగారం జీడిపప్పు పరిశ్రమలో చేరింది. భార్య పనికి వెళ్లి సంపాదించుకు రావటం రాజశేఖర్ కు సుతరాము ఇష్టం లేదు. భార్యపై రాను,రాను అనుమానం పెరగసాగింది.

పని నుంచి ఆమె ఇంటికి రాగానే ఆమె శీలాన్ని శంకిస్తూ అసభ్యకరమైన మాటలతో తూలనాడేవాడు. ఉద్యోగానికి వెళ్లొద్దని అనేవాడు. భార్య ఎంత చెప్పినా ఆమె శీలాన్ని శంకిస్తూ సూటి పోటి మాటలతో మానసికంగా గాయపరిచేవాడు. అయినా బిడ్డల కోసం కుటుంబ పోషణ కోసం బంగారం అవన్నీ భరించేది.



ఓ రోజు రాత్రి రాజశేఖర్ రోజు మాదిరిగానే ఫుల్లుగా తాగి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. భార్య బంగారం ఆరుబయట నిద్రిస్తోంది. పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రివేళ రాజశేఖర్ కొబ్బరి కాయలు కోసే కత్తితో భార్యను పాశవికంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో బంగారం అక్కడికక్కడే చనిపోయింది.



రాజశేఖర్ ఇంట్లోకి వెళి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారిన తర్వాత పిల్లలు చూసి పోలీసులకు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కురుండంకోడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య పై అనుమానం, మద్యాపానం కుటుంబాన్ని నాశనం చేయటమే కాక ఇద్దరు పిల్లలను అనాధలను చేసింది.