ములుగు : మావోయిస్టు సానుభూతి పరులు అరెస్ట్

  • Publish Date - November 2, 2020 / 09:25 PM IST

maoist sympathizers arrested : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సాయి చైతన్య, ఓఎస్డీ శోభన్ కుమార్‌తో కలిసి పట్టుబడిన వారి వివరాలు సోమవారం వివరించారు.

కొందరు మవోయిస్టు సానుభూతి పరులు ఛతీస్‌ఘడ్‌లో నక్సల్స్‌ అగ్రనేతలను కలిసేందుకు తాడ్వాయి మండల కేంద్రం మీదగా వెళ్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో పోలీసులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు.



ఈ క్రమంలో తాడ్వాయిలోని హరిత హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని పస్ర సీఐ, తాడ్వాయి ఎస్‌ఐ గుర్తించారు. పోలీసులను చూసి వీరు పారిపోయేందుకు యత్నిస్తుండగా వెంబడించి పట్టుకున్నారు.  పట్టుబడిన వారిని డబ్బకట్ల సుమన్(తాడ్వాయి), చందా మహేష్ (బయ్యక్కపేట), తాటిపాముల రమేష్(డోర్నకల్), చిడం జంగుదేవు(ఉట్నూర్) లుగా గుర్తించారు. వీరిని విచారించగా మవోయిస్టులకు సాయం చేస్తున్నట్లు అంగీకరించారు.



మావోయిస్టు అగ్రనేతలైన హరిభుషణ్, దామోదర్, రాజిరెడ్డి, మైలరపు అడేలును కలిసి వారికి కావాల్సిన సమాచారంతోపాటు విప్లవ సాహిత్యం పుస్తకాలను అందించేందుకు వీరు ఛత్తీస్‌గఢ్‌ వెళ్లేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

వీరితోపాటు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన మరో 13 మంది మావోయిస్టులకు సాయం చేస్తున్నట్లు గుర్తించామని…. వారిని కూడా త్వరలో అరెస్టు చేసి విచారిస్తామని ఏఎస్పీ తెలిపారు. ఈ నలుగురి వద్ద నుంచి కొన్నివిప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.