Thief deposits booty in bank, seeks redemption from God : ఇళ్ళలో చోరీలు చేసి పలాయనం చిత్తగించే దొంగను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతడు చెప్పిన మాట విని పోలీసులు షాక్ కు గురయ్యారు. చోరీ చేసిన సొత్తులో కొంత మొత్తం తన పాపాలు తొలగించమని దేవుడి హుండీలో డబ్బులు వేస్తానని సెలవిచ్చాడు ఈ చోరశిఖామణి.
జయంతి లాల్ కమలేష్ (27) అనే వ్యక్తి బడా బడా వ్యాపారస్తులు ఇళ్లల్లో ఇంట్లో సహాయకుడిగా పనికి చేరేవాడు. అక్కడ చేరిన కొన్నాళ్లకు ఇంట్లో విలువైన వస్తువులు, నగదు తీసుకుని పరారయ్యేవాడు. దొంగిలించిన నగదులో కొంత మొత్తాన్ని రెండు బ్యాంకుల్లో జమచేసేవాడు.
కొంత మొత్తాన్ని తనకు గల మూలశంక వ్యాధి చికిత్స కోసం దాచుకునేవాడు. చోరీ చేసిన ప్రతిసారి… ఆసొమ్ములో కొంత మొత్తంతో పుణ్య క్షేత్రాల దర్శనంకు వెళ్లి, చేసిన నేరానికి దేవుడ్ని క్షమాపణ కోరుతూ హుండీలో కొంత మొత్తాన్నివేసేవాడు.
బడా బాబుల ఇళ్లలో పనికి కుదరటానికి జయంతిలాల్ వారి డ్రైవర్లతో మొదట స్నేహం చేసేవాడు. క్రమంగా వారి ద్వారా ఆ ఇళ్లల్లోపనికి కుదిరేవాడు. అక్కడ అవకాశం చిక్కగానే చోరీ చేసి పలాయనం చిత్తగించేవాడు. ఇంతవరకు 10 మంది ఇళ్ళల్లో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే క్రమంలో గుజరాత్ లోని సూరత్ లోని రాధేశ్యాం గార్గ్ అనే ఒక డైయింగ్ మిల్లు యజమాని ఇంట్లో కొద్ది రోజుల క్రితం సహాయకుడిగా పనిలో చేరాడు.
వారి ఇంట్లో అక్టోబర్ 20న దొంగతనం చేసి ….రూ.6లక్షల నగదుతో పారిపోయాడు. అక్కడి నుంచి వాపి కి చేరుకుని…. చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని రెండు బ్యాంకుల్లో జమ చేసాడు. మిగతాది తనకు గల పైల్స్ వ్యాధి చికిత్స చేయించుకోటానికి తన వద్ద ఉంచుకున్నాడు. చోరీ జరిగిన విషయాన్ని గమనించిన రాధేశ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవంబర్ 4న జయంతి లాల్ ను మహారాష్ట్ర లోని అమరావతిలో అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు రికవరీలో భాగంగా పోలీసు విచారణలో అతడు చెప్పినమాటలు విని పోలీసులు ఆశ్చర్య పోయారు. పైల్స్ వ్యాధి చికిత్స కోసం రూ. 1.44లక్షలు ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.