ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య

  • Publish Date - August 12, 2020 / 12:40 PM IST

తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవటంతో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. సియోని జిల్లా కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు (ఒకరి వయస్సు18, మరోకరి వయస్సు 16 ఏళ్లు) అదే జిల్లాకు చెందిన ఇద్దరు యువకులతో ప్రేమలో పడ్డారు.

వారిలో ఒకరి బాయ్ ఫ్రెండ్ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆమె తండ్రికి ఎస్సెమ్మెస్ పంపించాడు. ఈ మెసేజ్ ను ఇంట్లో అందరూ చూశారు. దీంతో వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది.

తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందని భయపడిన అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయారు. గ్రామానికి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు మెసేజ్ పంపిన యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.