కాస్‌గంజ్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుళ్లు మార్కెట్ నుంచి వస్తుండగా వెనక నుంచి ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. మొదటి అది రోడ్డు ప్రమాదం అని అనుకున్నారు. కానీ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఇది యాక్సిడెంట్ కాదు హత్య అన్న షాకింగ్ విషయం బయపడింది.
అసలేం జరిగింది
ఉత్తరప్రదేశ్ లోని కాస్‌గంజ్‌లో శాంతి దేవి (50), బాదన్ సింగ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కూతురు సుష్మ (17) ఉంది. వీరి పొరుగింట్లో యశ్ వీర్ అనే యువకుడు నివసిస్తుండేవాడు. తన పొరుగింట్లో ఉండే బాధితురాలి కుటుంబంతో యశ్ వీర్ సన్నిహితంగా మెలిగేవాడు. వారితో కలివిడిగా ఉంటూ కుటుంబంలో ఒకడిగా మెదిలేవాడు. అయితే నాలుగేళ్ల క్రితం 2016లో పొరుగింట్లో ఒంటరిగా ఉన్న సుష్మపై యశ్ వీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు.
అయితే 2017లో బెయిల్‌పై బయటకు వచ్చిన యశ్‌వీర్ ఎలాగైనా బాధితురాలి కుటుంబంపై పగ తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సైకిలుపై ఇంటికి వస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ ఎక్కించగా వారిద్దరు అక్కడిక్కడే మరణించారు. బాదన్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్‌వీర్ ని పోలీసులు అరెస్టు చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
కాగా గత నాలుగేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని, పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. డబ్బు విషయంలో యశ్‌వీర్ తండ్రికి, బాధితురాలి తండ్రికి మధ్య జరిగిన గొడవలో నిందితుడి తండ్రి మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో యశ్‌వీర్.. బాధితురాలి తండ్రిపై ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్టు చేశామని, 2018లో అతడు జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బాదన్ సింగ్ ఫ్యామిలీపై పగ పెంచుకున్న యశ్ వీర్.. అతడి భార్య, కూతురిని డాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడని తెలిపారు.