వివాహిత మహిళపై ఎస్.ఐ లైంగిక వేధింపులు

  • Publish Date - August 19, 2020 / 12:32 PM IST

అత్తవారింట వరకట్న వేధింపులు భరించలేని వివాహిత న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ఆమె బాధంతా విన్న పోలీసు అధికారి ఆమెను కష్టాన్నుంచి  గట్టెక్కించి, న్యాయం చేస్తానన్నాడు. ఆమె నుంచి పూర్తి వివరాలు తీసుకున్నాడు.



కొన్నాళ్లకు  కేసు విచారణలో భాగంగా అంటూ ఆమెతో మాటలు కలిపాడు. క్రమేపి ఆ అధికారి తన నిజ స్వరూపం బయటపెట్టాడు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు వీడియోలు పంపటం మొదలెట్టే సరికి ఆ మహిళ ఉన్నతాధికారులను ఆశ్రయించింది.

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వివాహిత మహిళ అత్తవారింట్లో వరకట్న వేధింపులకు గురయ్యింది. ఈ విషయమై ఆమె బులంద్ షహర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళ్లింది. అక్కడ ఉన్న అజయ్ ప్రకాష్ సింగ్ అనే స్టేషన్ ఇంచార్జ్ ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించాడు. ఆమెకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఆమె ఇంటికి తిరిగి వెళ్ళి పోయింది.



కొద్ది రోజుల తర్వాత అజయ్ ప్రకాష్ సింగ్ ఆమెకు కేసు విషయమై ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు తరచూ ఫోన్ చేసి ఇతర విషయాలు మాట్లాడటం మొదలెట్టాడు. క్రమేపి ఆమెకు అశ్లీల మెసేజ్ లు , అశ్లీల వీడియోలు పంపించటం మొదలెట్టాడు. ఆమె చేసిన ఫిర్యాదును రిజిష్టర్ చేయకుండా, వ్యక్తిగత దర్యాప్తు పేరుతో ఈ విధంగా ప్రవర్తించటంతో ఆమె మనసు కీడును శంకించింది.

అజయ్ ప్రకాష్ సింగ్ పంపిన ఫోటోలు, వీడియోలు, మెసెజ్ ల స్క్రీన్ షాట్ లు భద్రపరుచుకుని  ఉన్నతాధికారులకు  ఫిర్యాదు చేసింది. అజయ్ ప్రకాష్ సింగ్ పంపిన అభ్యంతరకరమైన మెసేజ్ లు వీడియోలు వారికి అందించింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడిని విధులనుంచి సస్పెండ్ చేశారు. కేసు దర్యాప్తు చేసేందుకు మరో అధికారిని నియమించారు.