మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. సున్నపురాయి క్వారీలో పెళ్లలు విరిగి పడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని పస్ గిరిలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
జూన్ 13 శనివారం మధ్యాహ్నం పస్‌గరి ఏరియా, పప్‌రేడీ గ్రామంలోని ఓ సున్నాపురాయి క్వారీలో 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. సున్నపురాయి తవ్వుతుండగా పెద్ద మొత్తంలో పెళ్లలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. తీవ్రగాయాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
ఘటనలో 10 మంది ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన నలుగురిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ క్వారీ మూసేయాలని ఆదేశించారు. మృతుల అంత్యక్రియలు నిర్వహించటానికి వారి కుటుంబాలకు ఐదు వేల రూపాయల సహాయం అందించారు.