వెచ్చదనం కోసం చేసిన ఆ పనే! : నేపాల్ లో 8మంది కేరళ టూరిస్టులు మృతి

నేపాల్ లో ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మైనర్ లు కూడా ఉన్నారు. చనిపోయిన ఎనిమిది మంది పర్యాటకులను కేరళకు చెందిన ప్రబిన్ కుమార్ నాయిర్(39),శరణ్య(34),రంజిత్ కుమార్(39),ఇందు రంజిత్(34),శ్రీభద్ర(9),అభినబ్ సోరయ(9),అభి నాయర్(7),బైష్ణాబ్ రంజిత్(2)లుగా గుర్తించారు. వీరందరూ కేరళ నుంచి నేపాల్ లోని పోఖ్రా పర్యటనకు వెళ్లిన 15మంది బృందంలోని సభ్యులు.

నేపాల్ పర్యటన ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణమవడానికి సిద్ధమైన 15మంది కేరళ పర్యాటకుల బృందం సోమవారం(జనవరి-20,2020)రాత్రి నేపాల్ లోని మకవన్పూర్ జిల్లాలోని దమన్ లోని ఎవరెస్ట్ పనోరమా రిసార్ట్ లో బస చేశారు. నాలుగు రూమ్ లు బుక్ చేసుకున్నప్పటికీ రెండు జంటలు తమ నలుగురు పిల్లలతో కలిసి ఒక రూమ్ లో ఉన్నారు. మిగిలినవాళ్లు వేరే రూమ్ లో దిగారు.

అయితే చలిగా ఉన్న కారణంగా కొంచెం వెచ్చదనం కోసం ఎనిమిది మంది ఉన్న రూమ్ లోని వ్యక్తులు గ్యాస్ హీటర్ ఆన్ చేశారు. రూమ్ కిటీకీలు,డోర్ లు బోల్ట్ లతో బిగించివేయబడి ఉన్నాయి. దీంతో వెంటనే రూమ్ లోని ఎనిమిది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.  వాళ్లని హెలికాఫ్టర్ లో ఖాఠ్మండ్ లోని హాస్పిటల్ కు తరలించగా,ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ అధికారులు తెలిపారు.  

మరోవైపు ఎనిమిది మంది పర్యాటకుల మృతిపై కేరళ సీఎం పిన్నరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎనిమిది మంది మృదేహాలు వీలైనంత త్వరగా స్వస్థలానికి చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. మృతదేహాలను వీలైనంత తర్వగా భారత్ కు తీసుకొచ్చేందుకు కాఠ్మండులోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు ప్రయత్నిస్తున్నారని విదేశీవ్యవహారాల శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ తెలిపారు. కాఠ్మండులోని ఇండియన్ ఎంబసీతో రెగ్యులర్ టచ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.