కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలతో ఉపేంద్ర, రాజశేఖర్, నాగార్జునపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలకేంద్రంలో నూతన సంవత్సర వేడుకల్లో కత్తులతో దాడి కలకలం రేపింది. ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవాడలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న యువకులపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వేడుకల్లో మాటామాటా పెరిగి కత్తులతో దాడి చేశారా…? లేక పాత గొడవలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.