బీజేపీ నాయకుడిపై కేసు పెట్టిన మహిళ ఆత్మహత్య

కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న బాబురావ్ బసవన్నప్పకు 2011లో తాను 11.8కోట్లు ఇచ్చానని,అయితే ఆయన తనను చీటింగ్ చేశాడని,చెల్లని చెక్కు ఇచ్చాడంటూ అంజనా శాంత్ వీర్ అనే మహిళ కేసు ఫైల్ చేసింది. ఆ సమయంలో బాబూరావ్ కి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేయడం,2018లో ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అయితే కేసు పెట్టినప్పటినుంచి మంత్రి అనుచరులు నిత్యం అంజనాను వేధిస్తున్నారని,అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కటుంబసభ్యులు ఆరోపించారు. బుధవారం(అక్టోబర్-30,2019)సాయంత్రం అంజనా శాంత్ వీర్(38)పనిమీద బజారుకి వెళ్లిన తన కొడుకుకి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కంగారుపడిన అంజానా కొడుకు వెంటనే ఇంటికి చేరుకని డోర్టు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న తల్లి కన్పించింది.

దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించగా,ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. తనను చాలా మంది మోసం చేశారని,అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో అంజనా తెలిపింది. అసహజమరణం కింద కేసు ఫైల్ చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.