క్యాబ్ డ్రైవర్‌ను నేలకేసి కొట్టిన దుర్మార్గుడు.. వాడిని వదలొద్దని నెటిజన్ల డిమాండ్

అహంకారంతో కళ్లు నెత్తికెక్కి అమాయక క్యాబ్ డ్రైవర్‌ పట్ల పశువులా ప్రవర్తించిన ఆడీ కారు యజమానిపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముంది?

Mumbai Road Rage: ఉగ్రవాద కార్యకలాపా నిరోధక చట్టం ఉపా కింద కేసు పెట్టి, వాడిని జైల్లో పెట్టాలని ఈ నెటిజన్ కామెంట్ చేశాడు. ముంబైలో రోడ్ రేజ్ సంబంధించిన వైరల్ వీడియో చూసి సదరు నెటిజన్ ఈవిధంగా స్పందించాడు. కండకావరంతో విచక్షణారహితంగా ఓ డ్రైవర్‌పై విరుచుకుపడిన దుర్మార్గుడిని ఉద్దేశించి అతడీ కామెంట్ పెట్టాడు. ”ఈ రోజుల్లో కొంతమంది తాము శక్తివంతులమని నిరూపించుకోవడానికి బలహీనులపై ప్రతాపం చూపిస్తున్నార”ని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియో చూసినవాళ్లంతా ఇలాగే స్పందిస్తున్నారు. అహంకారంతో కళ్లు నెత్తికెక్కి అమాయక క్యాబ్ డ్రైవర్‌ పట్ల పశువులా ప్రవర్తించిన ఆడీ కారు యజమానిపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముంది?

అసలేం జరిగింది?
అది ముంబైలోని ఘట్‌కోపర్‌ ప్రాంతం. ఆగస్టు 18న రాత్రి 11:20 గంటల సమయంలో ఓ షాపింగ్ మాల్‌కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఎంట్రన్స్ నుంచి ముందు వైట్ కలర్ ఆడీ కారు లోపలి వస్తోంది. దాని వెనుకే మారుతి ఎర్టిగా ఓలా క్యాబ్ లోపలి వస్తోంది. ఆడీ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకున్న మారుతి కారు దానికి తాకింది. వెంటనే ఆడీ కారులోంచి ఓ మహిళ బయటకు దిగింది. తర్వాత ఆడీ కారు యజమానికి బయటకు వచ్చాడు. రావడంతోనే ఓలా క్యాబ్ డ్రైవర్‌పై విరుచుకుపడ్డాడు. గట్టిగా అరుస్తూ అతడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా క్యాబ్ డ్రైవర్‌ను తన రెండు చేతులతో పైకెత్తి నేలకేసి కొట్టాడు. బూటు కాళ్లతో ఇష్టమొచ్చినట్టు తన్నాడు.

ఆడీ కారు యజమాని భార్య కనీసం తన భర్తను ఆపడానికి కూడా ట్రై చేయలేదు. అక్కడే ఉన్న సెక్యురిటీ గార్డులు, జనం కూడా చోద్యం చూశారే తప్పా, దాడిని ఆపలేదు. నేలపై ఉలుకుపలుకు లేకుండా పడివున్న క్యాబ్ డ్రైవర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా, ఇంకా తిడుతూ ఆడీ కారు యజమాని, అతడి భార్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంఘటనా స్థలంలో ఉన్నవారు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. సృహ తప్పిపడిపోయిన బాధితుడికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొద్దిసేపటి తర్వాత సృహలోకి వచ్చిన అతడు తనంతట తానే మెల్లగా లేచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆడీ కారు యజమానిపై నెటిజనులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

కేసు నమోదు చేశాం: పోలీసులు
ఈ ఘటనపై ముంబై పోలీసులు స్పందించారు. బాధిత క్యాబ్ డ్రైవర్ కయముద్దీన్‌ని ఆస్పత్రికి తరలించామని.. ఆడీ కారు యజమాని రిషబ్ చక్రవర్తి, ఆయన భార్య అంతర ఘోష్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. “బాధితుడిని మొదట ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జెజె ఆసుపత్రికి తరలించాం. అతడి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశాం. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్‌పై దాడి చేసినందుకు రిషబ్, అతని భార్యపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. కోర్టుకు హాజరు కావాలని వారిద్దరికీ నోలీసులు జారీచేశామ”ని పోలీసు అధికారి ఒకరు పీటీఐతో చెప్పారు.

Also Read: ఎలా మోసం పోయాడో, అలాగే ఛీటింగ్ మొదలెట్టాడు.. మహా ముదురు

అతడిని శిక్షించాల్సిందే..
ఈ అమానవీయ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజనలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది అతిగా ప్రవరిస్తున్నారని, అవతలి వారి వివరణ వినకుండానే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముంబై ఘటనలో క్యాబ్ డ్రైవర్‌పై అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం లేదని, అతడిని గట్టిగా మందలించి.. నష్టపరిహారం కోరితే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. కేవలం కారు కోసం మనిషి ప్రాణాలకు ముప్పువాటిల్లేలా ప్రవర్తిస్తారా?, క్యాబ్ డ్రైవర్‌కు ఏమైనా అయితే అతడి కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ప్రశ్నించారు. ఆడీ కారు యజమానిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు