ఇంటికి సేఫ్‌గా చేరతామా? హైదరాబాద్‌లో దడ పుట్టిస్తున్న వరుస కారు ప్రమాదాలు

హైదరాబాద్ నగరంలో వరుస కారు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక ప్రమాదం మర్చిపోక ముందే మరో యాక్సిడెంట్

  • Publish Date - February 23, 2020 / 05:00 AM IST

హైదరాబాద్ నగరంలో వరుస కారు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక ప్రమాదం మర్చిపోక ముందే మరో యాక్సిడెంట్

హైదరాబాద్ నగరంలో వరుస కారు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక ప్రమాదం మర్చిపోక ముందే మరో యాక్సిడెంట్ జరుగుతోంది. దీంతో వాహనదారుల రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వాహనం రూపంలో మృత్యువు దూసుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లే పరిస్థితి రోడ్లపై ఉంది. ఆదివారం(ఫిబ్రవరి 23,2020) ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి రాయల్ టిఫిన్ సింటర్ లోకి దూసుకెళ్లింది. 

చెట్టుని ఢీకొన్న కారు..ముగ్గురు స్పాట్ లోనే మృతి:
ఇది జరిగిన కొన్ని గంటలకే..కర్మాన్ ఘాట్ చౌరస్తాలో మరో ఘోర కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్పాట్ లోనే చనిపోయారు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవ్ చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

రాయల్ టిఫిన్ సెంటర్ కాంపౌండ్‌ వాల్‌ను ఢీకొట్టిన కారు:
ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోనూ ఇలాంటి కారు ప్రమాదమే జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. అదుపుతప్పి రాయల్ టిఫిన్ సెంటర్ కాంపౌండ్‌ వాల్‌ను ఢీకొట్టింది. కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదం తర్వాత కారులోని యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. మద్యం మత్తులో కారును డ్రైవ్‌ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. జూబ్లిహిల్స్ వైపు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 10ఈపీ 6331 ప్రమాదానికి గురైంది. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వెళ్లే రోడ్డు ప్రధాన రహదారి. అటువైపు నుంచి వచ్చే వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తాయి. దీంతో ఈ స్పాట్ లో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినా.. ఈ స్పాట్ లో వాహనదారులు తమ వేగాన్ని తగ్గించుకోవడం లేదు.

రాయల్ టిఫిన్ సెంటర్ ఉన్న ప్రాంతంలో రోడ్డు ఇరుక్కుగా ఉంటుంది. పైగా డౌన్ ఉంటుంది. దీంతో ఇక్కడ వాహనాన్ని అదుపు చేయడం కష్ట సాధ్యం. కారు ప్రమాదం తర్వాత.. అందులో ఉన్న ముగ్గురు యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. మద్యం మత్తులో అతివేగంగా కారుని డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. అధికారులు చర్యలు తీసుకోవడం విఫలం అయ్యారని అందుకే, ఈ స్పాట్ లో పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర అనేక ప్రమాదాలు:
ప్రమాదం జరిగిన ప్రాంతంలో రాయల్ టిఫిన్ సెంటర్ ఉంది. అసలే ఈ రోడ్డు ఇరుక్కుగా ఉంటుంది. పైగా టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ చేసేందుకు పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఇరుకు రోడ్డుపై టిఫిన్ సెంటర్ కు ఎందుకు అనుమతి ఇచ్చారని వాహనదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. డీప్ కర్వ్ తో పాటు రోడ్డు డౌన్ ఉండటంతో.. స్లో గా వెళ్తున్న వాహనాలను కూడా అదుపు చేసేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది.. అతివేగంతో వచ్చే వాహనాలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే.. ప్రమాదానికి కారణం అవుతోందని అంటున్నారు.

భరత్ నగర్ ఫైఓవర్ పైనుంచి పడిన కారు:
వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో సొహైల్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. కూకట్‌పల్లి నుంచి సనత్‌నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కూడా మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడమే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఫ్లై ఓవర్ పై 40 కిలోమీటర్ల స్పీడ్ కు మాత్రమే పర్మిషన్ ఉండగా.. మత్తుల జోగుతున్న కారులోని యువకులు.. ఏకంగా 80 కిలోమీటర్ల కంటే వేగంతో దూసుకువెళ్లారని పోలీసులు తెలిపారు.

హఫీజ్ పేట్ లో హోటల్ లోకి దూసుకెళ్లిన కారు:
ఫిబ్రవరి 18న మియాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి కూడా లిక్కర్ కిక్కే కారణమని తేలింది. హఫీజ్‌ పేట్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంగా వచ్చాడు. అదుపు తప్పిన కారు.. రెండు వాహనాలను ఢీకొట్టి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్ లో ఉన్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. బైక్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని బీహెచ్ఈఎల్ కి చెందిన అఫ్సర్ గా గుర్తించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సంతోష్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు.

అమాయకులను చంపుతున్న తాగుబోతులు:
ఇలా వరుసగా జరుగుతున్న కారు బీభత్సాలు.. నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చిన వాహనదారులు.. తిరిగి ఇంటికి సేఫ్ గా చేరతామో లేదోనని వర్రీ అవుతున్నారు. ఓవైపు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లు ముమ్మరం చేసినా, భారీగా జరిమానాలు విధిస్తున్నా.. కోర్టులు జైలుకి పంపుతున్నా, తాగుబోతుల్లో మార్పు రావడం లేదు. ఫుల్లుగా తాగి రోడ్డెక్కుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా.. అమాయకుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం(ఫిబ్రవరి 23,2020) వెలుగుచూసిన రెండు ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయి.