chain snatching : తెంపుడుగాళ్లు మళ్లీ తమ చేతులకు పని చెబుతున్నారా..? ఒంటరి మహిళలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారా..? అదును చూసి మళ్లీ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. గత రెండు నెలలుగా నగరంలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనలే అందుకు నిదర్శనం.
హైదరాబాద్‌లో మళ్లీ గొలుసు దొంగల పంజా.. ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలు.. నగరంలో దడ పుట్టిస్తున్న వరుస ఘటనలు.. పోలీసులకు చిక్కకుండా ఎత్తులకు పైఎత్తులు.. చాలా కేసుల్లో పోలీసులకు చిక్కని కేటుగాళ్లు.. నగరంలో నిన్న..మొన్నటి వరకు వెనక్కి తగ్గినట్లే కనిపించిన గొలుసు దొంగలు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుంటూనే ఉన్నా…ఎక్కడో చోట మెరుపు వేగంతో తెంపుకెళ్లిపోతునే ఉన్నారు.
దుకాణాల్లో ఒంటరి మహిళలే టార్గెట్:
తాజాగా చింతల్‌లోని ఓ బొమ్మల దుకాణంలో ఉన్న మహిళపై కారం చల్లి గొలుసును దొంగిలించేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. పది రోజుల క్రితం రాజేంద్రనగర్ పీఎస్ పరిధి కిస్మత్‌పూర్‌లో రాత్రి 9 గంటల సమయంలో కిరాణ దుకాణంలో ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసును తెంపుకెళ్లారు. ఇప్పటికీ నిందితుల్ని గుర్తించ లేదు. అంతకుముందు…చింతల్ ఎల్లమ్మ గుడి రోడ్డు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర మార్నింగ్ వాక్ కి వెళుతున్న మహిళ మెడలో గొలుసును దొంగిలించి మెరుపు వేగంతో పరారయ్యారు. ఈ ఘటనలో కూడా ఇంకా కేటుగాళ్లు చిక్కలేదు.
నగరంలో వరుసగా స్నాచింగ్ లు:
సెప్టెంబరు 30న మల్కాజ్‌గిరి చాణిక్యపురి కాలనీలోని గ్రాండ్ అపార్ట్‌మెంట్ కింద జామ ఆకులు కోస్తున్న మహిళ మెడలో నుంచి మెరుపు వేగంతో మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. అక్టోబర్ 2న నేరెడ్‌మెట్ డిఫెన్స్ కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని గొలుసును తెంచుకుని పరారయ్యాడు. స్థానికుల సాయంతో రాచకొండ పోలీసులు అదే రోజు దొంగను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల కిందట పుప్పాలగూడలో స్కూటీపై వెనుక కూర్చున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ముగ్గురు గొలుసు దొంగలను సైబరాబాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
గొలుసు దొంగలుగా నగర యువకులు, ఈజీ మనీ కోసం చెడుదారి:
గతంలో ఎక్కడో చోట వాహనాలను దొంగిలించి, దాని నంబరు ప్లేట్‌ను తొలగించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గొలుసు దొంగతనాలకు పాల్పడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నగర యువకులే గొలుసు దొంగలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో విద్యార్థులు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒక్క గొలుసును లాక్కెళితే చాలు.. దండిగా డబ్బులొస్తాయనే ఉద్దేశంతోనే అటువైపు అడుగులు వేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. తర్వాత అదే అలవాటుగా మారుతుందని చెబుతున్నారు. తాజాగా కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా గొలుసు దొంగలుగా మారుతున్నారు. ఇటీవల నేరెడ్‌మెట్, మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ఆ కోవకు చెందిన వారే.
మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు:
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలనే గతంలో గొలుసు దొంగలు లక్ష్యంగా చేసుకునేవారు. ఇప్పుడు మరింత తెగిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలూ గొలుసును తెంచుకెళ్తున్నారు. బైక్‌పై వెనుక కూర్చున్న వాళ్లను సైతం వదిలిపెట్టడం లేదు. అనంతరం పోలీసులకు చిక్కకుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్కులు పెట్టుకుంటున్నారు. దృష్టి మరల్చేందుకు మార్గం మధ్యలోనే వేషం మార్చేస్తున్నారు. స్నాచర్స్ రెచ్చిపోతున్న సమయంలో..ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నిఘా పెంచాలని కోరుతున్న నగరవాసులు:
సీసీ కెమెరాలున్నాయి కదా అనే భరోసాతో క్షేత్ర స్థాయిలో నిఘాను పోలీసులు గాలికొదిలేశారని.. అందువల్లే ఇలా వరుస గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పాచింగ్‌లు తరచూగా జరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని కోరుతున్నారు.