రేప్ ని ప్రతిఘటించినందుకు సజీవంగా కాల్చేశాడు

  • Publish Date - July 3, 2020 / 03:58 PM IST

చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలోని కొత్వాలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

గ్రామంలోని ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు బబ్లూ భాస్కర్ అనే 30 ఏళ్ల యువకుడు. గతంలో కొన్నిసార్లు ఆమెను లైంగికంగా వేధించిన భాస్కర్… జూన్ 30 వ తేదీ మంగళవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న బాలికను బలాత్కరించబోయాడు. తన మానాన్ని కాపాడుకోపాటానికి భాస్కర్ ప్రయత్నాలను బాలిక అడ్డుకుంది. శాయశక్తులా ప్రయత్నించి అతడి ప్రయత్నాన్ని విఫలం చేసింది.  కోపంతో రగిలిపోయిన భాస్కర్ ఇంటిలోని కిరోసిన్ బాలికపై పోసి నిప్పంటించాడు.

వంటిపై మంటలు వ్యాపించటంతో బాలిక అరుచుకుంటూ బయటకు పరిగెత్తుకు వెళ్లి…రక్షించమని గట్టిగా కేకేలు వేసింది. బాలిక కేకలు విన్న గ్రామస్తులు ఆమె ఒంటిపై మంటలను ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక బుధవారం మరణించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బబ్లూ భాస్కర్ ను అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 506 (క్రిమినల్ బెదిరింపు) మరియు 354  పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ముంగేలి సబ్ డివిజనల్ పోలీసు అధికారి తేజ్రామ్ పటేల్ చెప్పారు.

Read:మూఢ నమ్మకాలతో గుడ్లగూబను బలిచ్చే 11 మంది ముఠా అరెస్ట్