తమ కుమార్తెను సినీనటి భానుప్రియ నిర్భందించిందని ఓ మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సీనియర్ నటి భానుప్రియపై పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఫైల్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు.. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంట్లో పని కోసం 14 ఏళ్ల తమ కూతురుని భానుప్రియ తీసుకెళ్లిందని.. ఏడాది కాలంగా కనీసం మాట్లాడనీయటం లేదని అమ్మాయి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పండ్రవాడకి చెందిన ప్రభావతి అనే మహిళ తన కుమార్తె సంధ్యను నటి భానుప్రియ ఇంట్లో పనికి పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పనికి ఒప్పుకుంది. సంధ్యను చెన్నై తీసుకెళ్లారు భానుప్రియ బంధువులు. అక్కడ ఇంట్లో పనికి పెట్టారు.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న ప్రభావతికి ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఏడాది కాలంగా కుమార్తె సంధ్యను ఇంటికి పంపించటం లేదని చెబుతోంది తల్లి. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనీయటం లేదని చెబుతోంది. ఇంట్లోనే నిర్బంధించిందని చెబుతున్నారు. గట్టిగా మాట్లాడితే, గొడవ చేస్తే చోరీ కేసులు పెడతామని కూడా బెదిరిస్తున్నారని తల్లి ప్రభావతి మీడియాకి వెల్లడించారు. ఈ క్రమంలోనే చైల్డ్ హెల్ఫ్ లైన్ సభ్యుల సహకారంతో భానుప్రియపై సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో కంప్లయిట్ చేశారు.
భానుప్రియపై వచ్చిన కంప్లయింట్‌ను పరిశీలిస్తున్నాం అంటున్నారు పోలీసులు. నిజానిజాలు నిర్ధారణ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని చెబుతున్నారు. విచారణ కొనసాగుతుందని ప్రకటించారు. ఇదే నిజం అయితే భానుప్రియ చిక్కుల్లో పడినట్లే. పిల్లలతో పని చేయించుకోవటం నేరం. వేధింపులు, బెదిరింపుల కింద మరో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తల్లి ప్రభావతి చెబుతున్న మాటల్లో నిజానిజాలు ఏంటో.. అసలు ఏం జరిగిందో పోలీస్ విచారణలోనే తేలనుంది.