Dalit student beaten to death by teacher for mistake in exam
UP: పరీక్షలో ఒకే ఒక పదం తప్పు రాసినందుకు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తప్పు రాసినందుకు ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలపాలైన సదరు విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగిందీ దారుణం. బాధితుడి పేరు నిఖిల్ డోహ్రే, 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలో ఒక పదం తప్పు రాసినందుకు సెప్టెంబర్ 7వ తేదీన సోషల్ సైన్స్ టీచర్ అశ్విని సింగ్ అతడిని తీవ్రంగా కొట్టాడు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ విషయమై సెప్టెంబర్ 24న పోలీసులకు నిఖిల్ తండ్రి రాజు డోహ్రె ఫిర్యాదు చేశాడు. అచ్చలద్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ నమోదు అయింది. అయితే తరగతి గదిలో నిఖిల్‌పై ఆధిపత్య కులానికి చెందిన అశ్విని సింగ్ అనే టీచర్ కులం పేరుతో తిట్టాడని, కులం ఆధారంగానే నిఖిల్ ను కర్రలతో కొట్టాడని, రాడ్డుతో సైతం కొట్టాడని, తన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తండ్రి రాజు పేర్కొన్నాడు.
ఈ విషయమై ఔరియా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చారు నిగమ్ మాట్లాడుతూ ‘‘ఈటావా సీఎంఓతో మేము మాట్లాడాము. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాం. వాస్తవాలు సేకరించిన అనంతరం, నిజా నిజాల్ని బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కాగా, ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. కొద్ది రోజుల క్రితం రాజస్తాన్‌లో టీచర్ కొట్టిన దెబ్బలు తాళలేక ఓ దళిత విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే యూపీలో అదే తరహాలో మరో దారుణం జరగడం దురదృష్టకరం.
Congress Crisis: గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం.. అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ…