Dammaiguda Girl Missing Case : స్కూల్ కి వెళ్లిన చిన్నారి చెరువులో శవమై కనిపించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనతో దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వాహనాలపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చిన్నారి మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించారు స్థానికులు. పోస్టుమార్టం నివేదిక తమకు ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణాలు ఏంటో తెలపాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. అడ్డు వచ్చిన పోలీసు వాహనాలపైనా వాళ్లు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న పదేళ్ల ఇందు.. నిన్న అదృశ్యం అయ్యింది. ఆ తర్వాత అనూహ్యంగా చెరువులో శవమై కనిపించడం సంచలనం రేపింది.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. చిన్నారి మృతి చెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన ఇందు.. దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ లో 4వ తరగతి చదువుతోంది. రోజూలాగే గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థిని సాయంత్రం పొద్దుపోయినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read..Missing Girl Died : మేడ్చల్ జిల్లాలో విషాదం.. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇంతలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ చెరువులో పాప మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతితో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. స్కూల్ కి వెళ్లిన చిన్నారి శవమై కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
అసలేం జరిగింది? బాలికను ఎవరైనా కిడ్నాప్ చేసి చంపేశారా? లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి కడతేర్చారా? లేక ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్కూల్‌కు వెళ్లిన బాలిక.. బ్యాగ్ ని స్కూల్ లోనే పెట్టి ఎందుకు బయటకు వచ్చింది? తనే స్వయంగా బయటకు వెళ్లిందా? లేక ఎవరైనా రమ్మని పిలిచారా? అసలేం జరిగి ఉంటుంది? ఇలా విభిన్న కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా, ఇది గంజాయి బ్యాచ్ పనే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ బాలికను హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.