దిశ నిందితుల పోస్టుమార్టం.. డాక్టర్ల మధ్య పంచాయతీ

  • Publish Date - December 7, 2019 / 06:56 AM IST

దిశ నిందితుల పోస్టుమార్టంలో హైడ్రామా చోటు చేసుకుంది. డాక్టర్ల మధ్య పంచాయతీ చెలరేగింది. గాంధీ ఆస్పత్రికి నుంచి మహబూబ్ నగర్‌కు వైద్య బృందం వచ్చింది. తమ పరిధిలోకి రావడం ఏంటనీ మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రశ్నించారు. వైద్యులు విదుల్లోకి రాకపోవడంతో ఇతర మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం నెలకొంది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఇతర డెడ్ బాడీస్‌ని జడ్చర్లకు తరలిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

2019, డిసెంబర్ 06వ తేదీ తెల్లవారుజామున షాద్ నగర్‌ వద్ద చటాన్ పల్లిలో నిందితులు దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు)లు చనిపోయారు. వీరి మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీ వైద్యుల చేత పోస్టుమార్టం నిర్వహించడంపై మహబూబ్ నగర్ వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వారి చేతనే పోస్టుమార్టం నిర్వహించుకోవాలని సూపరిటెండెంట్ తేల్చిచెప్పడంతో సందిగ్ధత నెలకొంది. నలుగురి మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలోనే భద్ర పరిచారు. NHRC ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉంటే…మహిళా సంఘ నేతలు, ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ మహిళా ఉమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బూటకపు ఎన్ కౌంటర్‌గా అభివర్ణించారు. ఫోరెన్సిక్ నిపుణులతో, ప్రముఖ వైద్యులతో మరలా పోస్టుమార్టం నిర్వహించాలని, ఇదంతా వీడియో తీయాలని పిటిషన్లలో పేర్కొన్నారు. డిసెంబర్ 09వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరిచాలని హైకోర్టు సూచించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అత్యాచారం జరిగిన ఘటనా స్థలాన్ని బృదం పరిశీలించనుంది. సమగ్ర దర్యాప్తు చేసిన అనంతరం ఓ నివేదిక తయారు చేయనుంది. నలుగురి మృతదేహాలను పరిశీలించిన అనంతరం ఎన్ కౌంటర్‌పై నివేదిక రెడీ చేయనుంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 
Read More : పోలీసులపై చర్యలు తీసుకోవాలి : దిశ కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్