ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యానికి ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. ఓ డాక్టర్ నిర్లక్ష్యం.. 65మంది చిన్నారులతో సహా 90మంది పాలిట శాపంగా మారింది. డాక్టర్ తనకు వచ్చిన భయంకరమైన HIV వ్యాధిని గుర్తించలేకపోయాడు. ఈ డాక్టర్ కలుషిత సిరంజి వాడటం వల్ల 90 మంది వ్యక్తులు హెచ్‌ఐవీ బారిన పడ్డారు. వీరిలో 65 మంది పిల్లలు కూడా ఉండటం విషాదకరం. ఈ అమానుష సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.
పాకిస్థాన్ లోని లర్కానా నగర సమీప ప్రాంతాల్లో 18 మంది చిన్నారుల్లో హెచ్‌ఐవీని గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో లర్కానా పరిధిలోని పలువురు పిల్లలకు HIV పరీక్షలు చేశారు.దీంతో 65మంది పిల్లలకు HIV ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు అనుమానం వచ్చి పెద్దవారికి కూడా పరీక్షించగా వారికి కూడా 25మందికి HIV పాజిటివ్ గా వెల్లడయ్యింది. ఇలా లర్కానా ప్రాంతంలో మొత్తం 90మందికి HIV పేషెట్లు ఉన్నట్లుగా డాక్టర్ అబ్దుల్ రహమాన్ తెలిపారు.
దీంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టగా..ఓ డాక్టర్ వద్ద వీరంతా ఏదోక సందర్భంలో ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు.. డాక్టర్ కు HIV పరీక్షలు చేయగా గతంలోనే అతనికి ఈ వ్యాధి ఉన్నట్లు బయటపడింది.
ఆ డాక్టర్ కలుషిత సిరంజీలు వాడటం వల్లే HIV వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని ప్రకటించారు. అతని దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వారిలో 65మంది చిన్నారులతో సహా మొత్తం 90మంది HIV సోకినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆ డాక్టర్ ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.