భారీ స్కామ్ : వెయ్యి కోట్ల రూపాయలు దోచేశారు

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్యూనెట్ స్కామ్ మరువకముందే మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ బయటపడింది. ఇది ఏకంగా వెయ్యి

  • Publish Date - March 12, 2019 / 02:39 PM IST

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్యూనెట్ స్కామ్ మరువకముందే మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ బయటపడింది. ఇది ఏకంగా వెయ్యి

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్యూనెట్ స్కామ్ మరువకముందే మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ బయటపడింది. ఇది ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్. ఈ బిజ్ పేరుతో జరిగిన మల్టీ లెవల్ మార్కెటింగ్‌ స్కామ్ ను సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. మాదాపూర్ లో ఈబిజ్ పేరుతో దందా చేస్తున్న ప్రధాన సూత్రదారుడు హితిక్ మల్హాన్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 2 లక్షలు సంపాదించొచ్చని నమ్మించి అడ్డంగా దోచేశాడు. ఈ-బిజ్‌ పేరుతో ప్రజల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈబిజ్‌ నిర్వాహాకుల అకౌంట్ లో ఉన్న 70 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్‌ చేశారు.
Read Also : రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు

విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ బిజ్‌ సంస్థ మోసాలకు పాల్పడుతోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నోయిడా కేంద్రంగా ఈ-లెర్నింగ్‌, కంప్యూటర్‌ కోర్సుల పేరుతో మోసాలు చేస్తున్నారని చెప్పారు. రూ.16 వేల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారని వెల్లడించారు. ఇలా ఈబిజ్‌ సంస్థ వెయ్యి కోట్ల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడిందని సజ్జనార్‌ వివరించారు.

హితిక్ మల్హాన్ 2001లో యూపీలోని నోయిడాలో ఈబిజ్ డాట్ కమ్ ప్రైవేట్ లిమిటేడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. డైరెక్ట్ బిజినెస్ ప్రొడక్ట్ సేల్ పేరుతో నడిపించాడు. దేశవ్యాప్తంగా చాలా  రాష్ట్రాల్లో ఈబిజ్ బ్రాంచులను ఏర్పాటు చేశాడు. స్టూడెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేశాడు. ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మించాడు. తమ కంపెనీ పలు రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తుందని, తమ కంపెనీలో మెంబర్ గా జాయిన్ అయ్యి వాటిని అమితే లక్షలు సంపాదించుకోవచ్చని మాయమాటలు చెప్పాడు. ప్రొడక్ట్స్ తో పాటు ఎడ్యుకేషన్ కు సంబంధించిన మల్టీ కోర్సులకు కూడా తక్కువ ధరకే ప్యాకేజీ ఉంటుందని సెమినార్లు పెట్టి లక్షలాది మందిని బురిడీ కొట్టించాడు. ఇలా దేశవ్యాప్తంగా ఈబిజ్ కంపెనీలో 7లక్షల మందిని మెంబర్లుగా జాయిన్ చేసుకుని వెయ్యి కోట్ల వరకు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్క పిర్యాదుతో ఈ బిజ్ పేరుతో మల్హాన్ నడుపుతున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ దందా గుట్టురట్టు అయ్యింది. డిగ్రీ చదువుతున్న వివేక్ కొందరు స్నేహితులతో ఈబిజ్ సెమినార్ కు హాజరయ్యాడు. కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఏడాదికే రెట్టింపు అవుతుంది అనడంతో ఆకర్షితుడైన వివేక్ ఈబిజ్ లో రూ.16వేలు పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత కట్టిన డబ్బు ఇవ్వమంటే మరికొందరిని ఈ కంపెనీలో చేర్పిస్తేనే డబ్బుతోపాటు కమీషన్ ఇస్తామడంతో మోసపోయానని గుర్తించిన వివేక్ మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈబిజ్ కంపెనీ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తమ స్టైల్ లో విచారిస్తే మొత్తం మోసం వెలుగులోకి వచ్చింది.

మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెడితే వెనక్కి రావని చెప్పారు. కేసులు నమోదై ఒకవేళ డబ్బు రికవరీ అయినా అది ప్రభుత్వానికి వెళ్తుందని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.