మరణానికి ముహూర్తం : వృద్ధ దంపతుల ఆత్మహత్య

  • Publish Date - November 9, 2019 / 02:04 AM IST

పిల్లలను పెంచి పెద్ద చేశారు. అందరికీ పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతను పూర్తి చేశారు. ఎవరిపైనా ఆధారపడకూడదనే ఉద్దేశ్యంతో..ఏడు పదుల వయస్సులో కాయకష్టం చేసి బతుకుతున్నారు. కానీ..వారికి అవమానాలు ఎదురయ్యాయి. అప్యాయత దక్కడం లేదని అనుకున్న ఆ వృద్ధ దంపతులు..తనువు చాలించాలని అనుకున్నారు. ఇందుకు ముహూర్తం చూసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో రాళ్లబండి సాలయ్య (76), రాధమ్మ (66) దంపతులు నివాసం ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. వీరికి పెళ్లిళ్లు చేశారు. కాయకష్టం చేసుకుంటూ పొట్టపోసుకొనే వారు. కానీ తమను ఆదరించాల్సిన వారి నుంచి నిత్యం ఎదురవుతున్న ఛీత్కారాలు వారు భరించలేకపోయారు. తాము చేసిన కొద్దిపాటి అప్పులు ముందే తీర్చేశారు. తమకు డబ్బులివ్వాల్సిన వారి పేర్లను ఓ బుక్‌లో రాసుకున్నారు. ఊరిలో ఓ పెద్దమనిషి దగ్గరకు వెళ్లి మంచి ముహూర్తం అడిగి తెలుసుకున్నారు. కార్తీక మాసం ఏకాదశి..ఉదయం 5 గంటలకు మంచి ముహూర్తం ఉందని తెలుసుకున్నారు.

అప్పుడు చనిపోతే..ఆత్మలైనా సంతోషంగా ఉంటాయి..జీవిత చరమాంకంలో సరిగ్గా చూసుకోని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగొద్దని వారు డిసైడ్ అయ్యారు. 2019, నవంబర్ 08వ తేదీ శుక్రవారం ఉదయం వీరు లేవకపోవడంతో కుటుంబసభ్యులు గమనించి లోనికి వెళ్లి చూశారు. కొత్తబట్టలు ధరించిన సాలయ్య, రాధమ్మలు విగతజీవులుగా కనిపించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఎవరికి ఆర్థిక భారం కాకూడదని సాలయ్య తమ దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ. 10 వేల డబ్బును దగ్గర ఉంచుకున్నారు. కొడుకు సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. 
Read More : చలో ట్యాంక్ బండ్ : ఆర్టీసీ జేఏసీ నేతల ముందస్తు అరెస్టు

ట్రెండింగ్ వార్తలు