Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ్ముతున్నాడు. గొర్రె పిల్లలు అమ్మకంతో తండ్రి వేంకటేశ్వర్లు నాయక్, కొడుకు మంగ్యా నాయక్ మధ్య వివాదం ముదిరింది. 10 రోజుల క్రితం కొడుకును చంపేశాడు తండ్రి. అనంతరం ఎర్రబాలెం కాలువ సమీపంలో శవాన్ని పాతి పెట్టాడు.
కొడుకు కనిపించకపోవడంతో తల్లి ప్రమీలా బాయి క్రోసూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసుల దర్యాఫ్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. తండ్రే హంతకుడు అని తేలింది. తన కొడుకుని తానే హత్య చేసినట్టు తండ్రి వేంకటేశ్వర్లు నాయక్ నేరాన్ని అంగీకరించాడు. పాతిపెట్టిన శవాన్ని పోలీసులు బయటకు తీశారు. అనంతరం పంచనామా చేపట్టారు.
కొడుకు మృతితో తల్లి కోటేశ్వరి భాయ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త వెంకటేశ్వర్లు నాయక్ గతంలో నాలుగు హత్యలు చేశాడని ఆమె తెలిపారు. తల్లిని, నా ఆడ బిడ్డను, చిన్న కొడుకును చంపేశాడు. ఇప్పుడు నా పెద్ద కొడుకును కూడా చంపేశాడని బోరున విలపించారు. భర్త పెట్టే వేధింపులు భరించలేక నా పెద్ద కొడుకును ఆయన వద్దే వదిలి తాను వెళ్లిపోయినట్లు కోటేశ్వరి తెలిపారు.
ఇప్పుడు నా కొడుకును లేకుండా చేశాడని వాపోయారు. తన భర్త మనిషి కాదు మానవ మృగం అని న్నారు. తన భర్త ఈ సమాజంలో ఉండకూడదన్నారు. అతడిని జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. కాగా, సీన్ రీ కన్‌స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు విచారిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు నాయక్ పై బంధువులు దాడి చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపైనా వారు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి.