బందువుల ఇంటికి వెళ్లి తిరిగి కారులో బయల్దేరిందో కుటుంబం. చిమ్మ చీకటి. రాత్రి పది అవుతుంది. కారు లైటు వెలుతూరు తప్ప ఏం కనిపించడం లేదు. కారు వెనుక సీట్లో నలుగురు కుటుంబ సభ్యులు కూర్చొన్నారు.
బెల్గవి: బందువుల ఇంటికి వెళ్లి తిరిగి కారులో బయల్దేరిందో కుటుంబం. చిమ్మ చీకటి. రాత్రి పది అవుతుంది. కారు లైటు వెలుతూరు తప్ప ఏం కనిపించడం లేదు. కారు వెనుక సీట్లో నలుగురు కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. ముందు సీట్లో కారు డ్రైవర్ పక్కన ఒకరు కూర్చొన్నారు. కర్ణాటకలోని కడాబి శివపూర్ సౌదట్టి తాలుకా దగ్గర ఘాటప్రభా కాలువ దగ్గరకు కారు చేరుకుంది. ఇంతలో వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపు తప్పి కాలులోకి దూసుకెళ్లింది. అంతే కారులోని ఐదుగురు కుటుంబ సభ్యులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కానీ, కారు డ్రైవర్ మాత్రం ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం కాలువలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మిగతా ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మృతులు పకిరవ్వవా పుజేరి (29), హనుమత్ పుజేరి (60), లంగమన్న పుజేరి (38), పారవ్వ పుజేరి (50), లక్ష్మి పుజేరి (40)గా పోలీసులు గుర్తించారు. మృతులంతా గోకక్ టౌన్ కు చెందిన నివాసులుగా గుర్తించారు. బంధువు ఇంట్లో వ్యక్తి అంత్యక్రియలకు పుజేరి కుటుంబం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.