విజయవాడ: వంటింటి గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
విజయవాడ: వంటింటి గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో వరుస గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు నగరవాసులకు నిద్ర లేకుండా చేశాయి. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మచిలీపట్నం రాజపేట మండలం మగ్గాల గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బాజీ(40) అనే వ్యక్తి మృతి చెందాడు. తల్లి మాత్రం తీవ్రగాయాలతో బయటపడగలిగింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మగ్గాల గ్రామంలో ఓ ఇంట్లో తల్లి, కొడుకు నివాసం ఉంటున్నారు. రాత్రి ఇంట్లోనే నిద్రిస్తున్నారు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. 2019, ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్ పేలి మంటలు చెలరేడంతో కొడుకు సజీవ దహనం అయ్యాడు. వెంటనే సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అగ్నిప్రమాదంలో ఇల్లు తగలబడిపోయింది. ఈ ఘటనతో మగ్గాల గ్రామవాసులు ఉలిక్కిపడ్డారు. స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. అయితే గ్యాస్ సిలిండర్ ఎలా పేలిందనే దానిపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి సిలిండర్ పేలిందా? లేక మరో కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.