Ghaziabad Sisters Incident Representative Image (Image Credit To Original Source)
Ghaziabad Sisters Incident: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురూ మైనర్లే కావడం మరింత షాక్ కి గురి చేసే అంశం. వారు భవనం 9వ అంతస్తులోని బాల్కనీ నుంచి దూకి వారు బలవన్మరణం చేసుకున్నారు. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ముగ్గురూ కొరియన్ కల్చర్‌కు బానిసలుగా మారారు. వారు దానికి ఎంతగా అడిక్ట్ అయ్యారంటే.. చదువు కూడా మానేసి అదే పనిగా పెట్టుకున్నారు. ఏకంగా తమ పేర్లను కూడా మార్చేసుకున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు వారిని మందలించారో, వారి నుంచి ఫోన్లు లాగేసుకున్నారో.. అంతే పిల్లలు మనస్తాపానికి గురయ్యారు. తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురూ ఒకేసారి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ‘అమ్మా నాన్న సారీ’ అని అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గది లోపల లాక్ చేసుకొని బాల్కనీ నుంచి దూకేశారని చెప్పారు. ‘కొరియాను మా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని పిల్లలు తరచూ అనేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ”క్షమించండి, నాన్నా. మేము చాలా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాం” ముగ్గురు సోదరీమణుల చివరి మాటలు ఇవి. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వారు ఆత్మహత్య చేసుకున్నారు.
ముగ్గురు బాలికల్లో ఒకరి వయసు 12 సంవత్సరాలు మరొకరి వయసు 14 ఏళ్లు, ఇంకొకరి వయసు 16 సంవత్సరాలు. వీరు ముగ్గురూ ఆన్ లైన్ గేమింగ్ (కొరియన్ టాస్క్-ఆధారిత గేమింగ్) కు బానిసలుగా మారారని అంతా అనుకున్నారు. అయితే, పోలీసులు గేమింగ్ కోణాన్ని తోసిపుచ్చారు. బాలికలు కొరియన్ కల్చర్ కి బాగా ప్రభావితమయ్యారని వారి డైరీల ద్వారా తెలిసిందని చెప్పారు.
బాలికలు కొరియన్ కల్చర్ ని బాగా ఇష్టపడ్డారని వారి డైరీల ద్వారా తెలిసిందన్నారు. కె-పాప్ కల్చర్, కొరియన్ సినిమాలు, కొరియన్ సంగీతం, కొరియన్ షార్ట్ ఫిల్మ్‌లు, కొరియన్ షోలు, కొరియన్ సిరీస్‌లు గురించి వారు తమ డైరీలో ప్రస్తావించారని పోలీసులు వెల్లడించారు. అయితే, తమ పిల్లలు అలాంటి కంటెంట్ చూడటం పట్ల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారని, వారి ఫోన్లను కూడా లాగేసుకున్నారని, ఇదే బాలికలను తీవ్ర చర్య తీసుకోవడానికి ప్రేరేపించిందని పోలీసు అధికారి వెల్లడించారు.
“ఒక సూసైడ్ నోట్ దొరికింది. ముగ్గురు అమ్మాయిలు సినిమా, సంగీతం, కొన్ని గేమ్స్ సహా కొరియన్ కల్చర్ కి ప్రభావితమయ్యారు. వారికి మొబైల్ వ్యసనం ఉంది. కుటుంబసభ్యులు ఫోన్ల వాడకాన్ని నిషేధించినప్పుడు, వారీ తీవ్ర చర్య తీసుకున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా వారు స్కూల్ కి కూడా వెళ్లడం లేదు” అని పోలీస్ అధికారి పేర్కొన్నారు.
బాలికల తండ్రి చేతన్ కుమార్ రెండు వివాహాలు చేసుకున్నాడు. అతడికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. చనిపోయిన ముగ్గురిలో ఒకరు చేతన్ మొదటి భార్య కూతురు. మరో ఇద్దరు రెండో భార్య పిల్లలు. చేతన్ ఇద్దరు భార్యలు అక్కాచెల్లెళ్లు. మొదటి భార్య గర్భం దాల్చకపోవడంతో చేతన్ రెండో వివాహం చేసుకున్నాడు.
”పిల్లల గదిలో ఒక నోట్ దొరికింది. అందులో ఏడుస్తున్న ఎమోజీ ఉంది. ఇది నిజమైన జీవిత కథ. ఈ డైరీలో ఏం రాశారో ప్రతిదీ చదవండి, ఎందుకంటే ప్రతిదీ నిజమే. ఇప్పుడే చదవండి! నన్ను క్షమించండి పాపా” అని ఆ నోట్ లో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, అమ్మాయిలు మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారని విచారణలో తేలింది. ఇక పిల్లల గది లోపల గోడపై “నేను చాలా చాలా ఒంటరిగా ఉన్నాను. నా జీవితం చాలా చాలా ఒంటరిగా ఉంది” అనే రాతలు కనిపించాయి.
”నా కూతుళ్లు ఆన్‌లైన్ టాస్క్ బేస్డ్ గేమ్ ఆడుతున్నారని నాకు అస్సలు తెలీదు. వారు లూడో ఆడుతున్నారని నేను అనుకున్నా. వారి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు” అని పిల్లల తండ్రి చేతన్ తెలిపాడు. పిల్లలు కొరియన్ సంస్కృతితో ప్రభావితమయ్యారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఇక, బాలికల మొబైల్ ఫోన్లు, వారి డిజిటల్ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ ఇంటరాక్షన్స్, యాప్ యూసేజ్ హిస్టరీని విశ్లేషించడంలో సైబర్ నిపుణులు సాయం కోరారు. ఐదు మంది పిల్లల్లో ముగ్గురు చనిపోగా ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు అబ్బాయి(9), మరొకరు అమ్మాయి(3).
ఈ పెను విషాదం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లలు మానసిక పరిస్థితి ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం ఫోన్ లో మునిగిపోవడం, గేమ్స్ కు బానిసలు కావడం తల్లిదండ్రులను కలవర పెడుతోంది. ఈ ఘటన.. పిల్లల మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రుల పర్యవేక్షణ, ఆన్‌లైన్ ప్రభావాలు, యువత ఇంట్లో ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తింది.