హైదరాబాద్ లో దారుణం, 5 ఆసుపత్రులు తిరిగినా పాపను బతికించుకోలేకపోయారు

హైదరాబాద్ లో దారుణం జరిగింది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి చనిపోయింది. కాగా, ఆ

  • Publish Date - May 31, 2020 / 02:20 AM IST

హైదరాబాద్ లో దారుణం జరిగింది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి చనిపోయింది. కాగా, ఆ

హైదరాబాద్ లో దారుణం జరిగింది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి చనిపోయింది. కాగా, ఆ పాపను బతికించుకునేందుకు పేదింటి తల్లిదండ్రులు చేసిన పోరాటం ఫలించ లేదు. దీనికి కారణం ఆసుపత్రులే. 5 ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. 6 గంటల పాటు నరకయాతన అనుభవించిన పాప కన్నుమూసింది. ఆసుపత్రుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ఆ చిన్నారి ప్రాణం తీశాయి. ‘అమ్మా నాన్న.. భయమైతంది’ అంటూ కూతురు పలికిన చివరి పలుకులు తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. హైదరాబాద్‌లో శనివారం(మే 30,2020) ఈ ఘటన జరిగింది.

రోడ్డు మీదకు వెళ్లిన చిన్నారిపై వీధి కుక్కల దాడి:
మహబూబాబాద్‌ జిల్లా పెద్దగూడూరు కారంపూడి తండాకు చెందిన అంగోత్‌ హోలీ నాయక్‌ తన భార్య కవిత, కూతురు అంగోత్‌ బేబి, కొడుకు గణేశ్‌లతో కలసి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. నగర శివార్లలోని చెంగిచెర్లలో సుశీల టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారు ఉంటున్న కాలనీకి ఆనుకొని ఒకవైపు అడవి, మరోవైపు యాటల మండీ (జంతు వధశాల) ఉన్నాయి. రోజులాగే నాయక్‌ శనివారం ఆటో తీసుకొని బయటకు వెళ్లాడు. భార్య కవిత ఉదయం 10 గంటలకు పాపకు అన్నం తినిపించింది. ఆ తర్వాత బట్టలు ఉతుకుతోంది. ఇంతలో అక్కడికి వచ్చిన కూతురు, అమ్మా టాయ్‌లెట్‌ వస్తోందని చెప్పడంతో బాత్‌రూమ్‌కు వెళ్లమని తల్లి చెప్పింది. అయితే బేబి ఇంటి ముందు ఉన్న రోడ్డుపైకి వెళ్లింది. దీన్ని తల్లి గమనించ లేదు. 

కుక్కల దాడిలో పాప ఒళ్లంతా గాయాలు:
అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన ఐదు వీధి కుక్కలు పాపపై దాడి చేశాయి. నిస్సహాయంగా ఉన్న ఆ పాపను ఒళ్లంతా పట్టి పీకాయి. ఇంటి బయట కుక్కల అరుపులు, కూతురి ఆర్తనాదాలు విన్న తల్లి వెంటనే బయటకు పరిగెత్తింది. అక్కడ చూడగా పాపను కుక్కలు కరుస్తుండటం కనిపించింది. వెంటనే అక్కడున్న కర్రలు, రాళ్లతో కుక్కలను చెదరగొట్టిన కవిత… భర్తకు విషయం తెలపడంతోపాటు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. అప్పటికే పాప శరీరమంతా రక్తసిక్తమైంది.

పాప ప్రాణాలతో ఆడుకున్న ఆసుపత్రులు:
శనివారం ఉదయం 10.30 గంటలకు కుక్కలు దాడి చేయగా 11 గంటల సమయంలో తల్లిదండ్రులు పాపను ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి యాజమాన్యం ఫీజు వసూలు చేసి రెండు గంటలపాటు చికిత్స చేసింది. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. సమీపంలోని అంకుర ఆస్పత్రికి తరలించాలని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో చేసేది లేక మరో అంబులెన్సులో తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను దాదాపు మూడు గంటలపాటు పరీక్షించిన వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో మరో అంబులెన్సులో సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు ఆ చిన్నారికి చికిత్స చేయబోమని తెగేసి చెప్పడంతో ఫీవర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

6 గంటలు నరకం చూసింది:
అక్కడ వైద్యులు పరీక్షలు చేసే సమయంలో నీళ్లు తాగిన పాప తనకు భయంగా ఉందంటూ తల్లిదండ్రులతో చివరగా మాట్లాడింది. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో పాపను నిలోఫర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సాయంత్రం 4:15 గంటలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిలోఫర్‌లో దాదాపు గంటపాటు చికిత్స పొందిన చిన్నారి చివరకు కన్నుమూసింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు షాక్ తిన్నారు. 5 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తమ బిడ్డను ఎవరూ కాపాడలేకపోయారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఆసుపత్రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. పేరుకేమో కార్పొరేట్ ఆసుపత్రులు. అత్యాధునిక టెక్నాలజీ ఉందని గొప్పలు చెబుతారు. కానీ ట్రీట్ మెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఓ చిన్న పాపను కాపాడలేకపోయిన ఆసుపత్రుల తీరుపై జనాలు మండిపడుతున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఎన్ని ఉన్నా ఏం లాభం అని నిట్టూరుస్తున్నారు.