పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేవారి ఆస్తులను జప్తు చేస్తానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ డిసెంబర్ 19న ప్రకటించారు. అల్లర్లకు, హింసకు దిగే ఆందోళకారుల ఆస్తుల్ని జప్తు చేసి నష్టపోయివారికి ఆ ఆస్తిని పంచేస్తానని హెచ్చరించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీ రాజధాని లక్నో తోపాటు పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాంగ్రెస్, ఎస్పీ, మరికొన్ని పార్టీలు ఈ హింసను ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆందోళనకారులు పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చారు. కాగా…..ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో 260 మంది పోలీసులు గాయపడ్డారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోటానికి సీఎం సిధ్దమయ్యారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి ఆస్తులను వేలంవేసి జరిగిన నష్టాన్ని భర్తీ చేసే పనిలో పడ్డారు యోగీ. యూపీ లోని పలు జిల్లాల్లో 130 మందిని గుర్తించిన అధికారులు వారికి నోటీసులు పంపారు. దాడులకు కారణమై, హింసను ప్రేరింపించి.దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేసినందుకు రూ.50 లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు.
రాళ్లు విసిరి, ఆస్తులను ధ్వంసం చేసినవారిని వీడియో, సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించి, వారికి నోటీసులు పంపారు. రామ్‌పూర్ జిల్లాలో 28 మందికి, సంభాల్‌లో 26, బిజనూర్‌లో 43, గోరఖ్‌పూర్‌లో 33 మందికి నోటీసులు పంపారు. ఆందోళనలు సందర్భంగా చెలరేగిన హింస వల్ల రామ్‌పూర్‌లో రూ.14.8 లక్షలు, సంభాల్‌లో రూ.15 లక్షలు, బిజ్‌నూర్‌లో 19.7 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా వేశారు.. గోరఖ్‌పూర్‌లో జరిగిన నష్టంపై అధికారుల లెక్కల వేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసి విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించి వారిలో 48 మందిని అరెస్టు చేశారు.