తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకేత్తెంచిన హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెబుతుందా ? లేదా ? అనే తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. కోర్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
హాజీపూర్ హత్యల కేసులో నల్గొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం తుది తీర్పు వెల్లడించనుంది. మధ్యాహ్నం లోపు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ కూడా తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరయ్యారు.
ఇటు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష విధించాలంటూ హాజీపూర్ గ్రామ సచివాలయం దగ్గర బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, ఇతరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డికి ఎటువంటి శిక్ష విధిస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అత్యంత క్రూరంగా ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య చేసిన కేసుల్లో నిందితుడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజిపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి.. లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చి పెట్టాడు.
సంచలనం సృష్టించిన ఈ వరుస హత్య కేసులపై కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. జనవరి 27నే తీర్పు వస్తుందని అనుకునప్నప్పటికీ అనివార్య కారణాల వల్ల 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారానికి వాయిదా పడింది.
మర్రి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడని.. జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్ పదేపదే విజ్ఞప్తి చేసింది. ఈ కేసులను అరుదైన కేసుల్లో అరుదైనవిగా పరిగణించాలని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందుకు అనుగుణంగా ఉన్నాయని ప్రాసిక్యూటర్ వాదించారు.
ప్రాసిక్యూషన్ వాదనలోని పలు అంశాలను డిఫెన్స్ తిప్పికొట్టినా.. ప్రాసిక్యూషన్ వాటిని ఖండించింది. కేవలం విచారణను జాప్యం చేసేందుకే నిందితుడు తప్పుడు వాదన వినిపిస్తున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులతో పాటు.. హాజీపూర్ వాసులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు నేతలు.. నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
ఏప్పుడేం జరిగింది : –
* 2019, ఏప్రిల్ 25 హాజీపూర్ గ్రామంలో విద్యార్థిని శ్రావణి అదృశ్యం.
* 2019. ఏప్రిల్ 25 పోలీసులకు తల్లిదండ్రులు కంప్లయింట్.
* 2019, ఏప్రిల్ 25 శ్రావణి కోసం పోలీసుల గాలింపు.
* సీసీ కెమెరాలు లేకపోవడంతో దొరకని ఆచూకీ.
* 2019, ఏప్రిల్ 26 శ్రావణి పాఠశాలకు వెళ్లి విచారించిన పోలీసులు.
* 2019, ఏప్రిల్ 26 శ్రావణి బొమ్మలరామారం వెళ్లినట్లు గుర్తింపు.
* 2019, ఏప్రిల్ 26 సీసీటీవీ ఫుటేజ్‌తో దర్యాప్తు ప్రారంభం.
* కీసర – బొమ్మలరామారం మార్గంలో గాలింపు.
* 2019, ఏప్రిల్ 26 పాడుబడిన బావి పక్కన శ్రావణి స్కూల్ బ్యాగ్ గుర్తింపు.
* 2019, ఏప్రిల్ 27 బావిలో దొరికిన మృతదేహం.
* శ్రావణి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు.
* 2019, ఏప్రిల్ 27 శ్రీనివాసరెడ్డికి చెందిన బావిగా గుర్తించిన పోలీసులు.
* పోలీసుల అదుపులో శ్రీనివాసరెడ్డి.
* 2019, ఏప్రిల్ 27 శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్న శ్రీనివాస్ రెడ్డి.
* 2019, ఏప్రిల్ 29 పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు.
* 2019, ఏప్రిల్ 29 2015లో మైసిరెడ్డి పల్లికి చెందిన కల్పనను చంపేసినట్లు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి. మనీషా అనే బాలికను కూడా హత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు.
* ప్రస్తుతం తీర్పు ఏ విధంగా వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. దీంతో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో వెలువడే తీర్పుపై ఆసక్తి నెలకొంది. దారుణమైన నేరాలు చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నేరస్తులకు కఠిన శిక్షలు పడాలని జనం కోరుతున్నారు.