విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో.. సపోర్టింగ్ స్టాఫ్‌ను విచారించింది. వరుసగా మూడో రోజు శ్రద్ధ హాస్పిటల్‌లో తనిఖీలు చేపట్టిన త్రిసభ్య కమిటీ.. కీలక ఆధారాలు సేకరించింది. మొత్తం 66 కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లు కమిటీ గుర్తించింది. రేపు సాయంత్రం లోగా.. డ్రాఫ్ర్ట్ సిద్ధం చేస్తామన్న కమిటీసభ్యులు.. వారంలోగా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు.
శ్రద్ధ ఆసుపత్రిలో గత ఐదేళ్లలో ఎన్ని కిడ్నీ మార్పిడి చికిత్సలు చేశారు…? నిబంధనలు పాటించారా లేదా…? అధికారిక అనుమతులున్నాయా లేదా అన్నదానిపై కమిటీ సభ్యులు ఆరా తీశారు. ఒక ప్రశ్నావళి రూపొందించి.. ఆ ప్రకారం సమాధానం ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆపరేషన్ల తాలుకూ కే షీట్లు, రికార్డులు పరిశీలించారు. పూర్తి వివరాలు రేపు సాయంత్రంలోపు సబ్ మిట్ చేయాలని.. ఆదేశించారు. రికార్డులు పోలీసులు సీజ్ చేసినట్లు.. శ్రద్దా ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారని, మహారాణి పేట పోలీస్ స్టేషన్ నుంచి వాటిని తీసుకుంటామని కమిటీ సభ్యులు చెప్పారు.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే.. కేజీహెచ్‌లోని ప్రిన్సిపల్ సెక్రటరీ, విమ్స్ డైరక్టర్లతో కూడిన కమిటీ అనుమతి తప్పని సరని త్రిసభ్య కమిటీ సభ్యులు డీసీహెచ్‌వో నాయక్ తెలిపారు. కమిటీ అప్రూవల్ లేకుండా కిడ్నీట్రాన్స్ ప్లాంటేషన్ చేయకూడదన్నారు. తాము పరిశీలించిన వాటిలో నాలుగు, ఐదు కేసులకు కేజీహెచ్ కమిటీ అనుమతులు ఉన్నాయన్నారు. అయితే అన్నింటికి అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దరఖాస్తు వచ్చినప్పుడు కేజీహెచ్‌లోని కమిటీ.. పూర్తిగా వివరాలను పరిశీలిస్తుందని డీసీహెచ్‌వో నాయక్ చెప్పారు. డోనర్ ఎందుకు ఇస్తున్నాడు. వాళ్లతో ఏదైనా బంధువుత్వముందా.. లేక కిడ్నీ అమ్ముకుంటున్నారా అనేది పరిశీలించిన తరువాతే అనుమతులు జారీ చేస్తామన్నారు.
కిడ్నీ మార్పిడీకి సంబంధించి 2022 వరకూ శ్రద్ధ ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. దీంతోనే యాజమాన్యం తప్పించుకు తిరుగుతుందన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు బెంగళూరులో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో కొన్ని బృందాలు అక్కడకు కూడా వెళ్లాయి. మరోవైపు ముందస్తు బెయిల్‌కోసం ఆస్పత్రి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది.