ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పలువురు బంధువులు, సన్నిహితుల ఒత్తిడే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పలువురు బంధువులు, సన్నిహితుల ఒత్తిడే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమృత, ప్రణయ్ వివాహం తర్వాత ఆస్తిమొత్తం మారుతీరావు..తమ్ముడు శ్రవణ్‌కు చెందిన ట్రస్ట్‌కు రాశారు. ఆ తర్వాత కొద్దీ రోజులకే ప్రణయ్ హత్య ఘటన జరిగింది. మారుతీరావు బెయిల్ పై విడుదల అయిన 3 నెలల క్రితం తర్వాత వీలునామాను భార్య పేరుతో తిరగ రాయించారు. తనకు సంబంధం లేకున్నా హత్య కేసులో ఇన్వాల్వ్ చేసిన అన్న ఆస్తి కూడా తిరగ రాయించడంతో తమ్ముడు శ్రావణ్ ఆవేదనకు గురయ్యాడు.
అప్పటి నుండి శ్రావణ్ అన్న మారుతీరావుకు దూరంగా ఉంటున్నాడు. అయితే తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని శ్రావణ్ ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఇటీవల ప్రణయ్ హత్య కేసు ట్రయిల్ కు రావడంతో మరోసారి మారుతిరావు, సహా నిందితుల మధ్య వివిధ అంశాల పై చర్చ జరిగినట్టు సమాచారం. నీ వల్ల జీవితాలు నాశనం చేసుకున్నామని మారుతిరావుతో వాగ్వివాదానికి దిగినట్టు సమాచారం. వారి నుండి ఒత్తిడి, కచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందన్న సమాచారంతో మారుతిరావు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ప్రణయ్ హత్య కేసు ట్రయిల్స్ మొదటి రోజు తమ మోపిన అభియోగాలను మార్చాలని కోర్టులో మారుతిరావు, శ్రావణ్, కరీం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం పిటిషన్ తిరస్కరించింది. ఇంటి వెనుక గుర్తు తెలియని మృతదేహం లభించిన ఘటనలోనూ పోలీసు విచారణ ఎదుర్కొన్నారు మారుతిరావు. సొంత సామాజిక వర్గంలోనూ విమర్శలను ఎదుర్కోవడం పై ఆవేదన గురైనట్టు సమాచారం.
ఈ క్రమంలో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నిన్న ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు… విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే… దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాయర్‌ను కలిసేందుకు మారుతీరావు నిన్న తన డ్రైవర్‌తో కలసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సాయంత్రం 6.40కి డ్రైవర్‌తో కలిసి ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు.. రెండ్రోజుల కోసం రూమ్ బుక్ చేసుకున్నాడు.
306 గదిలో బస చేశాడు. ఏడున్నరకు డ్రైవర్‌ను పిలిపించిన మారుతీరావు గారెలు తినాలనిపిస్తుందని… తీసుకురమ్మని పంపాడు. రేపు ఉదయం లాయర్ దగ్గరకు వెళ్లాలి 8గంటలకల్లా రూమ్‌కు రమ్మని డ్రైవర్‌కు చెప్పాడు. అతడిని కారులోనే పడుకోమని చెప్పి 5వందల రూపాయలు కూడా ఇచ్చాడు. కాసేపటి తర్వాత వైట్‌పేపర్ తెప్పించుకున్నాడు.
ఆ తర్వాత తన భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఇవాళ ఉదయం ఏడున్నరకి మారుతీరావు కోసం గదికి వెళ్లిన డ్రైవర్… డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో మారుతీరావు భార్య తన భర్తకు ఫోన్ చేసింది. అతడి ఫోన్ కలవకపోవడంతో డ్రైవర్‌కు కాల్ చేసింది. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది సాయంతో పోలీసులకు ఫోన్ చేశారు. వారు తలుపులను పగలగొట్టేసరికి మారుతీరావు శవమై కనిపించాడు.
పోస్టుమార్టం అనంతరం మారుతీరావు మృతదేహాన్ని స్వస్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. నాలుగు దశాబ్దాలుగా తమతో కలిసి ఉన్నాడని.. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదంటున్నారు స్థానికలు.