Google Map: 20 ఏళ్ల తరువాత మాఫియా డాన్ ను పట్టించిన గూగుల్ మ్యాప్స్

20 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న పేరుమోసిన మాఫియా డాన్ ను, సాంకేతికత సహాయంతో పోలీసులు పట్టుకున్నారు.

Don

Google Map: సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ..పోలీసులు, చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న కేటుగాళ్లు..ఇకపై తప్పించుకోలేరు. ఏదో ఒకరోజు వారి పాపంపండి..కలుగులో నక్కివున్నా.. పోలీసులు పట్టుకుంటారు. సరిగ్గా అటువంటి ఘటన ఇటీవల ఇటలీలో చోటుచేసుకుంది. 20 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న పేరుమోసిన మాఫియా డాన్ ను, సాంకేతికత సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇటలీకి చెందిన గియోయాచినో గామినో అనే మాఫియా డాన్.. 20 ఏళ్ల క్రితం రోమ్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించేవాడు. 2002కు ముందు చాలా ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటనలో.. గియోయాచినోకి అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే తన అనుచరుల సహాయంతో 2003లో రోమ్ లోని రెబిబియా జైలు నుంచి పరారైన గియోయాచినో.. ఆతరువాత ఎవరి కంటపడలేదు.

Also read: Nara Lokesh: పోలవరం నిర్వాసితుల సమస్యలపై జగన్ కు లోకేష్ లేఖ

అతని కోసం ఇటలీ పోలీసులు చాలా ఏళ్లుగా గాలిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఒక కేసు విషయమై(గియోయాచినోకి సంబందించినది కాదు) గూగుల్ మ్యాప్స్ ను శోధిస్తున్న ఇటలీ పోలీసులకు అందులో ఒక ఫోటోను పరిశీలించగా..అచ్చు గియోయాచినోలానే ఉన్న వ్యక్తి కనిపించాడు. దీంతో గత రెండేళ్లుగా ఆ ఫోటో పట్టుకు తిరిగిన.. ఇటాలియన్ యాంటీ మాఫియా పోలీస్ యూనిట్ (DIA), ఆ ఫొటోలో ఉన్నది.. గియోయాచినో అని నిర్ధారించుకున్నారు. అయితే ఆఫొటో ఎక్కడ తీసింది అనే విషయంపై ఆరా తీసిన పోలీసులు.. అది స్పెయిన్ దేశంలోని గాలపాగర్ అనే ప్రాంతంలోనిదిగా గుర్తించారు. ఆప్రాంతానికి వెళ్లిన ఇటలీ పోలీసుల బృందం ఎట్టకేలకు.. మాఫియా డాన్ గియోయాచినో గామినోను పట్టుకుంది. స్పెయిన్ దేశం అనుమతితో గియోయాచినో గామినోను తమ దేశానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం 61 ఏళ్ల గియోయాచినో గామినో..గతంలో పోలీసులను ముప్పతిప్పలు పెట్టేవాడని.. అతని కోసం వెతికిన పోలీసు ఒకరు ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Also read: AP Cinema Ticket Rates : సినిమా టికెట్ రేట్ల గురించి చాలా మాట్లాడాలి.. సపరేట్‌గా ప్రెస్‌మీట్ పెడతాను