దూల తీరింది : స్ట్రాంగ్ రూంలో ఫోటో దిగినందుకు కేసు నమోదు 

  • Publish Date - April 13, 2019 / 02:42 PM IST

హైదరాబాద్: చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు చిక్కుల్లో పడ్డాడొక టీఆర్ఎస్ నాయకుడు. 2019 ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  నిషిధ్ద ప్రాంతమైన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కీసర టీఆర్ఎస్ నాయకుడు నాయకపు వెంకటేష్ కేసు నమోదు చేసారు కీసర పోలీసులు. 

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో  మేడ్చల్, కుత్బుల్లా పూర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్​పల్లి, ఎల్బీ నగర్, కంటోన్మెంట్​ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను, వీవీ ప్యాట్లను కీసర మండలం బోగారంలోని హోళీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో భధ్రపరిచారు. శుక్రవారం  పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల అధికారులు వీటికి సీల్ వేసి భద్రపరిచారు.  ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్ కి వచ్చిన కీసర మండల టీఆర్ఎస్ నేత నాయకపు వెంకటేష్ తనకు సంబంధం లేని కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన స్ట్రాంగ్ రూమ్ కి వెళ్లి  అక్కడ ఫొటో దిగారు. ఈ ఫొటోను అత్యుత్సాహంతో సోషల్ మీడియా లో పోస్టు చేశారు.  సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఈసీ, భద్రతా వైఫల్యం అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంవీ రెడ్డి.. పూర్తి విచారణ జరపాలని ఏఆర్వోలను ఆదేశించారు.

పార్లమెంట్ ఎన్నికలలో వాడిన ఈవీఎం యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోటో దిగి వాట్సాప్, సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడంతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్.చంద్రశేఖర్ ఫిర్యాదుతో  వెంకటేష్ పై క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద  కేసు నమోదు చేసి,విచారణ జరుపుతున్నట్లు కీసర పోలీసులు తెలిపారు.