మాజీ క్రికెటర్ హత్య కేసు-కొడుకే నిందితుడు

  • Publish Date - June 10, 2020 / 12:32 PM IST

కేరళ మాజీ రంజీ క్రికెటర్‌ కె.జయమోహన్‌ తంపి(64) హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యం మత్తులో సొంత కుమారడు  అశ్వినే ఈ ఘాతకానికి ఒడిగట్టాడని పోలీసులు  తెలిపారు. ఈ మాజీ క్రికెటర్‌ సోమవారం  జూన్8వ తేదీ ఉదయం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మొదటి నుంచి ఆయన కొడుకు అశ్విన్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు  విషయం బయటపడింది. 

‘జయమోహన్ ఆయన కుమారుడు అశ్విన్ లు ఇద్దరికీ  ప్రతిరోజు ఇంట్లోనే మద్యం సేవించే అలవాటు ఉంది. జయమోహన్ హత్యకు గురైన రోజు(శనివారం) కూడా వారిద్దరూ ఇంట్లోనే  మద్యం తీసుకున్నారు. అప్పటికి ఉన్న మద్యం అయిపోవటంతో  మరింత మద్యం కోసం తండ్రి డెబిట్‌ కార్డును ఉపయోగించడానికి అశ్విన్‌ ప్రయత్నించాడు. అయితే దీనికి జయమోహన్‌ అంగీకరించలేదు. 

దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగొడవకు దారితీసింది. ఈ క్రమంలో జయమోహన్‌ను అశ్విన్‌ బలంగా తోసేయడంతో కిందపడ్డాడు. ఈక్రమంలో జయమోహన్  తలకు తీవ్రగాయం అయింది. ఆ తర్వాత తండ్రి శవాన్ని పక్కకు పడేసి అక్కడే మరింత మద్యం సేవించి పడుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు.  ఇక జయమోహన్‌ 1979-82 సమయంలో కేరళ తరుపున 6 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు.