Nun found dead in Kochi quarry pond : కేరళలోని ఒక షెల్టర్ హోం నుంచి రెండు రోజుల క్రితం కనపడకుండా పోయిన నన్.. కొచ్చిలోని వజక్కల్ సమీపంలోని క్వారీ గుంతలో శవమై తేలటం కలకలం రేపింది. మృతురాలిని కొట్టాయం జిల్లాలోని ముండక్కాయంలోని కోరుతోడుకు చెందిన జసీనా థామస్(44) గా గుర్తించారు.
కొచ్చిలోని వివిధ ప్రదేశాల్లో పని చేస్తున్న నన్ లు 12 మంది కలిసి కొట్టాయం జిల్లాలో వజక్కల్ వద్ద ఉన్న సెయింట్ థామస్ కాన్వెంట్ లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం భోజనాల సమయంలో జసీనా థామస్ కనపడటం లేదని గుర్తించిన మిగిలిన నన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె గురించి గాలింపు చేపట్టారు.
నన్స్ నివసిస్తున్న కాన్వెంట్ వెనుక వైపు ఉన్న క్వారీ గుంతలో జసీనా థామస్ మృతదేహాం లభ్యమయ్యింది. బాధిత మహిళ మూడేళ్ల క్రితం కాన్వెంట్ లో చేరినట్లు తెలిసింది. గత కొంత కాలంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు సహచర నన్ లు చెప్పారు. కాగా థామస్ మరణానికి గల కారణాలను తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కలమసేరి లోని ఫ్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. స్కూల్ వెనుక క్వారీని కొంత భాగం తవ్విన తర్వాత వదిలివేయటంతో దానిలో నీరు చేరింది.ఆ నీటి గుంతలో పడిథామస్ మరణించింది.