కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

  • Publish Date - October 31, 2019 / 01:33 PM IST

ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమార్తె  పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల  సాయి పెట్టిన 420, 506  బెదిరింపులు, అక్రమ వసూళ్లు  కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగిపోయారు.

కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జి షీట్ నమోదు అయ్యేంత వరకు  నరసరావుపేట వన్ టౌన్, టూ టౌన్  పోలీసు స్టేషన్లలో ప్రతి ఆదివారం హాజరై తప్పని సరిగా సంతకం చేయాలని ఆదేశించింది. 

కోడెల శివప్రసాదరావు ఏపీ స్పీకర్ గా పని చేసిన రోజుల్లో ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మిలు సత్తెనపల్లి,నరసరావు పేట పరిసర ప్రాంతాల్లో కే ట్యాక్సు పేరుతో బలవంతపు వసూళ్ళు, బెదిరింపులు ఆక్రమణలు కొనసాగించారు. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో  కోడెల కుటుంబ బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి కోడెల కుటుంబం చేసిన అరాచకాన్ని బయటపెట్టారు. కేసులు నమోదుచేసుకున్న  పోలీసులు వారి కోసం ప్రయత్నించగా శివరాం, విజయలక్ష్మిలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  తదనంతరం జరిగిన పరిణామాల్లో  2019 సెప్టెంబర్ 16న కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవటంతో శివరాం అజ్ఞాతం వీడి బయటకు రాగా, అక్టోబరు 31న విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లోంగి పోయారు.