హైదరాబాద్ : ప్రేమించిన యువకుడు తనను పట్టించుకోవట్లేదనే పగతో అతడి పై పగ తీర్చుకునేందుకు వాట్సప్ ను ఆయుధంగా ఉపయోగించిందో యువతి. ఇందుకోసం తన కొలీగ్ సహాయం తీసుకుంది. వీరిద్దరూ చేసిన పనికి ఏమీ సంబంధం లేని యువతి ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. దాంతో బాధితులు ఇచ్చిన కంప్లయింట్ తో వన్ సైడ్ లవ్ స్టోరీ వ్యవహారం వెలుగు చూసి నిందితుడు కటకటాల పాలయ్యాడు.
చర్లపల్లిలోని ఒక కంపెనీలో పని చేసే ఉమామహేశ్వరి అనే యువతికి ఫేస్ బుక్ ద్వారా ఖమ్మంకు చెందని మహేశ్ తో పరిచయం ఉంది. అతడ్ని మహేశ్వరి గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఐతే మహేశ్ ఆమెను పట్టించుకోవటంలేదు. ఆమె ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ కావటంలేదు. ఈ క్రమంలో అతడి పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఉమా మహేశ్వరి నిర్ణయించుకుంది. తాను పని చేస్తున్న కంపెనీలోనే ఉండే నారాయణ రావు అనే వ్యక్తి సహయం కోరింది. ఉమా మహేశ్వరి సూచనలు మేరకు నారాయణరావు మహేశ్ పేరుతో “టెంపర్ బాయ్” పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఉమా మహేశ్వరి మహేశ్ కు చెందిన బంధువులు, మహిళల నెంబర్లు సేకరించి నారాయణ రావుకు ఇచ్చింది. నారాయణరావు క్రియేట్ చేసిన గ్రూప్లో మహేశ్ కుటుంబానికి చెందిన బంధువులు, మహిళల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి, వాళ్లంతా కాల్ గర్ల్స్, మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని వారి ఫోన్ నెంబర్లు ఇస్తూ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.
ఈ చర్యతో మహేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసిన నారాయణరావును అరెస్టు చేశారు .దీనికంతటికీ కారణమైన ఉమా మహేశ్వరి పరారీలో ఉంది. నిందితుడి నుంచి పోలీసులు 4 సిమ్ కార్డులు, స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.