ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని ప్రేమ జంట ఆత్మహత్య

lovers end life in kodada : క్షణికావేశంలో ఒక ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రెండుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కోదాడలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన యువకుడు అదే కాలనీకి చెందిన ఒక యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.

ఇరు కుటుంబాల పెద్దలు తమ పెళ్ళికి అంగీకరించరని భయపడి, కలిసి జీవించే ధైర్యం చేయలేక ఇద్దరూ కలిసి గురువారం తమ తమ ఇళ్లలోంచి వెళ్లిపోయారు. రెండు కుటుంబాల వారు తమ పిల్లలు ఆదృశ్యమయ్యారని స్ధానిక పోలీసు స్టేషన్ లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.

శనివారం ఉదయం కోదాడలోని పెద్ద చెరువు గట్టుపైకి మార్నింగ్ వాక్ కు వచ్చిన కొందరు అక్కడ పడి  ఉన్న బట్టల బ్యాగు చూశారు. అది తెరిచి చూడగా అందులో ఆధార్ కార్డు కనిపించింది. ఆవిషయాన్నివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మిస్సింగ్ కేసు నమోదైన వ్యక్తి పేరు ఆధార్ తో సరిపోవటంతో పోలీసులు లక్ష్మీపురంలోని వారికి సమాచారం ఇచ్చారు. అంతా కలిసి చెరువు గట్టు వద్దకు వచ్చి గాలించగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఆత్మహత్య చేసుకునిఉంటారనే అనుమానంతో గజఈతగాళ్లను  పిలిపించి చెరువులో గాలింపు చేపట్టగా చెరువులోని రెండు మృతదేహాలను వెలికి తీశారు.

ఘటనాస్ధలికి చేరుకున్న ఇరుకుంటుంబాలవారు కన్నీరు మున్నీరుగా విలపించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.