భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు

రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న  శ్రీనగర్‌లో దాడికి జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు ఇజాజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సాహిల్‌ ఫారూక్‌ గోజ్రీ, నాసీర్‌ అహ్మద్‌ మీర్‌ లను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు, డిటోనేటర్లు, జిలెటిన్‌ రాడ్స్, నైట్రిక్‌ యాసిడ్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే వీరు హజ్రత్బాల్‌ ప్రాంతంలో గ్రైనేడ్‌ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆగస్టు-5,2019 తర్వాత వ్యాలీలో నిషేధాలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ వస్తున్న ప్రస్తుత సమయంలో ఈ ఉగ్రదాడి కుట్ర వెలుగులోకి వచ్చింది.

మరోవైపు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యులకు “చురుకుగా సహాయం” చేసిన ఆరోపణలపై కాశ్మీర్ జోన్ పోలీసులు అవంతిపోరా నివాసి జహంగీర్ పారేను నిన్న అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం, కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని తాంట్నా గ్రామంలో ముఖాముఖి కాల్పుల్లో ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక జిల్లా కమాండర్‌ను పోలీసులు కాల్చి చంపారు. హరూన్ అబ్బాస్‌గా గుర్తించబడిన ఈ వ్యక్తి 2018 లో జమ్మూ బీజేపీ నాయకుడు అనిల్ పరిహార్, అతని సోదరుడు అజిత్ హత్యకు పాల్పడిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల బృందంలో భాగమని పోలీసులు తెలిపారు.

గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ని పునర్విభజించి అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా,లఢఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడ్డాయి. కశ్మీర్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీని క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు పాలన యంత్రాంగం చెబుతుండగా, గత శుక్రవారం, జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రజల “ప్రాథమిక హక్కు” అని తెలిపింది. 160 రోజులకు పైగా ఇంటర్నెట్ కనెక్టివిటీకి అడ్డంగా ఉన్న సమస్యలను సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రంగాన్ని సుప్రీం ఆదేశించింది.

ఇక ఆర్టికల్ 370రద్దు సమయంలో నిర్బంధంలోకి తీసుకున్న అనేక మంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఇప్పటికే విడుదలయ్యారు. మరికొందరు ముఖ్యనాయకులు ఒమర్ అబ్దుల్లా,మొహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా లాంటి వారు మాత్రం ఇంకా గృహనిర్భంధంలోనే ఉన్నారు.