ఆన్‌లైన్ షాపింగ్ వచ్చాక మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్బాల్లో కస్టమర్లు మోసపోతుంటే.. మరికొన్ని సందర్భాలలో కస్టమర్లే ఈ కామర్స్ సంస్థలను మోసం చేస్తున్నారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను ఓ యువకుడు భారీగా మోసం చేశాడు.
మధ్యప్రదేశ్ సైబర్ విభాగం ఎస్పీ జితేంద్ర సింగ్ కేసు వివరాలను మీడియాకు వివరించారు. గత కొంతకాలం నుంచి ఓ యువకుడు ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి రూ. 30 లక్షలకు పైగా మోసం చేసినట్లు తేలింది. ఇండోర్‌కు చెందిన మహ్మద్ మహువాలా(27) ఫేక్ ఈమెయిల్ అకౌంట్స్, ఫోన్ నంబర్లతో అకౌంట్లను క్రియేట్ చేసి ఖరీదైన గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్‌ను కొనుగోలు చేశాడు. ఆ వస్తువులు తన వద్దకు వచ్చాక వాటిని తీసేసుకొని.. దగ్గరలో ఉన్న దుకాణాల్లో తక్కువ దరకు అమ్మేస్తున్నాడు. అంతేకాదు తనకు వచ్చిన పార్సిల్ ఖాళీగా ఉందని చెప్పి.. తిరిగి అమెజాన్ సంస్థకు పంపేవాడు. అమెజాన్ కూడా ఇతడికి నగదును రిఫండ్ చేసేది. ఈ విధంగా రూ. 30 లక్షలకు పైగా అమెజాన్ సంస్థను ఆ యువకుడు మోసం చేశాడు.
మొత్తానికి అమెజాన్ సంస్థ యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఖరీదైన మొబైల్ ఫోన్స్‌ను, రెండు స్మార్ట్ గడియారాలు, క్రెడిట్ కార్డు, వైర్‌లెస్ రూటర్‌తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి అమెజాన్ సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు సహాయపడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.