లలితా జువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగ దొరికాడు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి
తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తిరుచ్చి లలితా జువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగను పట్టుకున్నారు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా దొంగ దొరికాడు. బైక్ పై వచ్చిన మరో దొంగ పారిపోయాడు. నిందితుడి నుంచి పోలీసులు రూ.13 కోట్ల విలువ చేసే 5 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నారు. దొంగ దగ్గరున్న బంగారం బార్ కోడ్ ను పోలీసులు తనిఖీ చేశారు. అది లలితా జువెలరీకి సంబంధించిన గోల్డ్ గా గుర్తించారు. నిందితుడు మణికందన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరో నిందితుడు సురేష్ కోసం గాలిస్తున్నారు. చోరీకి పాల్పడ్డ నిందితులిద్దరూ తమిళనాడు వాసులే అని పోలీసులు తెలిపారు.
లలితా జువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. బుధవారం(అక్టోబర్ 2,2019) తెల్లవారుజామున తిరుచ్చి సత్రం బస్‌స్టేషన్ సమీపంలోని లలితా జువెలరీ షోరూం గోడకు కన్నంవేసి లోపలకు ప్రవేశించిన దోపిడీ దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న తిరుచ్చి పోలీసులు.. దొంగలను పట్టుకునేందుకు 7 ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు.
కాగా, తిరుచ్చి సమీపంలోని పుదుక్కొట్టైలో ఓ హోటల్లో ఉన్న ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఐదుగురు హోటల్ రూంలో ఉండగా, ఓ వ్యక్తి వారికి భోజనం తెచ్చేందుకు వెళ్లాడు. పోలీసులను చూసి అతడు పారిపోయే ప్రయత్నం చేసి కిందపడ్డాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, మిగిలిన ఐదుగురిని పోలీసులు ప్రశ్నించారు. తాము దొంగలం కాదని బ్లాంకెట్లు అమ్ముకోవడానికి వచ్చామని వారు పోలీసులతో చెప్పినట్టు తెలిసింది.
దొంగలు చోరీ చేసిన విధానం చూసి పోలీసులే షాక్ తిన్నారు. ఓ భారీ గ్యాస్ కట్టర్ సాయంతో రెండు అడుగుల మందపాటి గోడను కట్ చేశారు. ముఖానికి జంతువుల మాస్క్‌లు తొడుక్కున్నారు. చేతులు, కాళ్లకు గ్లౌజ్ వేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ కుక్కల నుంచి తప్పించుకోవడానికి అక్కడ కారం చల్లారు. కారం పొడి చల్లడంతో కుక్కలు.. దొంగలు వెళ్లిన మార్గాన్ని గుర్తించలేవని.. అందుకే అలా చేశారని పోలీసులు తెలిపారు. ఓ వైపు దొంగల కోసం వేట కొనసాగిస్తూనే మరోవైపు జువెలరీలో పనిచేసే ఉద్యోగులను కూడా ప్రశ్నించారు పోలీసులు. కాపలాగా ఉన్న 12 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఎంక్వైరీ చేశారు. చివరికి దొంగ దొరకడంతో మేనేజ్ మెంట్ ఊపిరి పీల్చుకుంది.