ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే పాయిజన్ బాటిల్ ఎందుకు లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. మారుతీరావు మృతదేహం లభించిన గదిలో ఆనవాళ్లు దొరకలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ కారణాలు బయటపడలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మారుతీరావు గదిలో లభించిన లేఖలో చేతిరాత ఆయనదా..? కాదా? తేల్చేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నిన్న ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు… విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే… దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లాయర్‌ను కలిసేందుకు మారుతీరావు నిన్న తన డ్రైవర్‌తో కలసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సాయంత్రం 6.40కి డ్రైవర్‌తో కలిసి ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు.. రెండ్రోజుల కోసం రూమ్ బుక్ చేసుకున్నాడు. 306 గదిలో బస చేశాడు. ఏడున్నరకు డ్రైవర్‌ను పిలిపించిన మారుతీరావు గారెలు తినాలనిపిస్తుందని… తీసుకురమ్మని పంపాడు. రేపు ఉదయం లాయర్ దగ్గరకు వెళ్లాలి 8గంటలకల్లా రూమ్‌కు రమ్మని డ్రైవర్‌కు చెప్పాడు. అతడిని కారులోనే పడుకోమని చెప్పి 5వందల రూపాయలు కూడా ఇచ్చాడు. కాసేపటి తర్వాత వైట్‌పేపర్ తెప్పించుకున్నాడు.
ఆ తర్వాత తన భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఇవాళ ఉదయం ఏడున్నరకి మారుతీరావు కోసం గదికి వెళ్లిన డ్రైవర్… డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో మారుతీరావు భార్య తన భర్తకు ఫోన్ చేసింది. అతడి ఫోన్ కలవకపోవడంతో డ్రైవర్‌కు కాల్ చేసింది. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది సాయంతో పోలీసులకు ఫోన్ చేశారు. వారు తలుపులను పగలగొట్టేసరికి మారుతీరావు శవమై కనిపించాడు.
మారుతీరావు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషం తాగి సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా రిపోర్టు ఇచ్చారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అమృతను అమ్మ దగ్గరికి వెళ్లాలని కోరుతూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. మారుతీరావు మృతిపై క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మారుతీరావు మృతదేహం మిర్యాలగూడకు తరలించారు. రేపు అంత్యక్రియలు జరుగనున్నాయి.