మతిస్థిమితం కోల్పోయిన టెకీ రోడ్డుపై వీరంగం

  • Publish Date - November 22, 2019 / 07:06 AM IST

మతిస్ధిమితం  కోల్పోయిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో  కలకలం సృష్టించాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3, నాగార్జున సర్కిల్ దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులపై రాళ్లతో దాడి చేసి ఇబ్బందులకు గురి చేశాడు. భయాందోళనలకు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి వచ్చిన పోలీసులనూ అతడు ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తాళ్లతో బంధించి స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో గంటసేపు నాగార్జన సర్కిల్ లో ట్రాఫిక్ జాం అయ్యింది. మసాబ్ ట్యాంక్, జూబ్లీ చెక్ పోస్టు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మతిస్ధిమితం లేని వ్యక్తిని రక్ష రాజుగా పోలీసుల గుర్తించారు.

తిరుమలగిరిలో నివాసం ఉండే రాజు డెలాయిట్ లో పని చేస్తున్నాడని తెలిసింది. మతిస్ధిమితం కోల్పోయి 3 రోజులుగా రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించారు. పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని తెలిశాక అంతా షాక్ తిన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇలా కావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యో పాపం అని జాలి చూపారు.