మాదాపూర్లో హత్యాయత్నం : బెల్టు షాపు నిర్వాహాకుడిపై దాడి

  • Publish Date - March 6, 2019 / 09:44 AM IST

హైదరాబాద్ : మాదాపూర్‌లో పట్టపగలు రాము అనే వ్యక్తి పై  జరిగిన హత్యాయత్నం స్ధానికంగా కలకలం రేపింది.  బెల్టు షాపు నిర్వాహించే రాము అనే వ్యక్తిని బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు.  తీవ్రంగా గాయపడిన అతడ్ని స్ధానికులు ఆస్పత్రికి తరలించారు. రాము ఇంట్లో ఉన్నాడా ? లేడా ?  అని అతని అక్క మణెమ్మ తో  ఫోన్ లో ఆరా తీసి …. ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని  దుండగులు ఈ ఘాతకానికి ఒడి గట్టారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాము పరిస్థితి విషమంగా వున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  అయితే హత్యాయత్నం చేసిన ఆ ఇద్దరు ఎవరో తనకు తెలియదని..ఫోన్ చేసి రాము గురించి ఆరా తీశారని రాము అక్క మణెమ్మ తెలిపింది. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. పోలీసులు  ఆ ఏరియాలో ఉన్న సీసీ టీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తు ఆగంతకులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. రాము అక్క మణెమ్మకు వచ్చిన పోన్ నెంబర్ ద్వారా ఆగంతకులు ఎవరనేది పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.  ఆగంతకులకు,రాముకు ఎమైనా పాత కక్షలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.