భారీ శబ్దాలు చేసే మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకులు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

'సౌండ్' బాబుల బెండు తీశారు నల్లగొండ పోలీసులు. బైకులకు నిషేధిత మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి చక్కర్లు కొడుతున్న వారితోనే.. వాటిని ఊడబీకించి పబ్లిగ్గా ధ్వంసం చేశారు.

Nalgonda police publicly destroyed 70 banned modified bike silencer

modified bike silencer: సమాజంతో ఎన్ని మార్పులు వస్తున్నా కొంతమంది మాత్రం బాధ్యాతారహితంగానే ప్రవరిస్తున్నారు. పాలకులు, అధికార యంత్రాంగం ఎంత అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతూ తోటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపేవారిలో చాలా మంది నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారితో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇంకొంత మంది అయితే తమ దర్పాన్ని ప్రదర్శించడానికి వాహనాలను వాడుతున్నారు. బైకులకు నిషేధిత మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి, పెద్దపెద్ద శబద్దాలతో జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారికి అక్కడక్కడా పోలీసులు బుద్ధి చెబుతున్నా పరిస్థితి మారడం లేదు.

తాజాగా నల్లగొండ జిల్లా పోలీసులు ‘సౌండ్’ బాబులకు షాక్ ఇచ్చారు. భారీ శబ్దాలు చేస్తూ ప్రజలను భయపెడుతున్న బైకర్లపై కొరడా ఝళిపించారు. 70 బైకుల సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని, వాటిని జనంతా చూస్తుండగా బహిరంగంగా రోడ్డు రోలర్‌తో తొక్కించి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా డీఎస్పీ రాములు నాయక్.. పబ్లిక్‌కి ఇబ్బందులు కలిగిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి మోడిఫైడ్ సైలెన్సర్లను సీజ్ చేసినట్టు చెప్పారు.

Also Read: చేసేది పోలీస్ ఉద్యోగం.. డాన్స్ మాత్రం ఖ‌ల్‌నాయ‌క్ పాట‌కు.. ఏంటి బాస్ ఇది!

”కొంతమంది వాహనదారులు, ముఖ్యంగా యువకులు గత కొద్దిరోజులుగా అధిక శబ్దాలతో సౌండ్ పొల్యుషన్ చేస్తూ నల్లగొండ పట్టణ ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తున్నట్టు మేము గుర్తించాం. దీంతో ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి 70 సైలెన్సర్లను సీజ్ చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాటిని పబ్లిగ్గా ధ్వంసం చేశాం. శబ్దకాలుష్యంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారీ శబ్దాలు చేసే మోడిఫైడ్ సైలెన్సర్లను వినియోగించే వారి గురించి పోలీసులకు సమాచారం అందించండి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామ”ని డీఎస్పీ రాములు నాయక్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు